పెట్టుబడుల పేరుతో మోసం

పెట్టుబడుల పేరుతో మోసం
  •  రాయదుర్గం పోలీసులను ఆశ్రయించిన బాధితులు

గచ్చిబౌలి, వెలుగు : పెట్టబడులు, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై రాయదుర్గం పీఎస్ లో కేసు నమోదైంది. ఇన్ స్పెక్టర్ మహేశ్  తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్​ మండలం మజీద్​పల్లికి చెందిన ఎర్రకోటి కృష్ణకు తన ఫ్రెండ్ ద్వారా గచ్చిబౌలిలోని జనార్దన్ హిల్స్ లో ఉండే కోటిపల్లి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తన వద్ద డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రెట్టింపు ఇస్తానని కృష్ణను శ్రీనివాస్ నమ్మించాడు. దీంతో కృష్ణ అతడికి రెండేండ్ల కిందట 28 లక్షలను ఇచ్చాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ స్పందించకపోవడంతో కృష్ణ మంగళవారం రాయదుర్గం పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. 

అయితే నిందితుడు శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని మరికొందరిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 10 మంది ఇలా మోసపోయినట్లు తెలుసుకున్నారు. ఉద్యోగాల పేరుతో శ్రీనివాస్ ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మోసపోయిన బాధితులు మంగళవారం రాయదుర్గం పీఎస్ ను ఆశ్రయించగా.. వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు.