హర్యానా మంత్రి సందీప్ సింగ్‭పై లైంగిక వేధింపుల కేసు

హర్యానా మంత్రి సందీప్ సింగ్‭పై లైంగిక వేధింపుల కేసు
  • హర్యానాలో లైంగిక వేధింపుల కేసు..
  • శాఖను వదులుకున్న మంత్రి
  • కేబినెట్​లో కొనసాగుతున్న సందీప్​ సింగ్​
  • ఆరోపణల్లో నిజంలేదని వీడియో రిలీజ్

చండీగఢ్: హర్యానా స్పోర్ట్స్ మినిస్టర్ సందీప్ సింగ్ ఆదివారం తన పోర్ట్ ఫోలియోను వదులుకున్నారు. స్పోర్ట్స్ మినిస్ట్రీతో పాటు ప్రింటింగ్, స్టేషనరీ శాఖ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. తనపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో.. స్పోర్ట్స్ మినిస్ట్రీ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. ప్రింటింగ్, స్టేషనరీ శాఖ మంత్రిగా కేబినెట్​లో ఇకపైనా కొనసాగుతారు. కాగా, మంత్రి సందీప్​సింగ్​ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని జూనియర్​ అథ్లెట్ మహిళా కోచ్ సీఎంతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మహిళా కోచ్​ ఆరోపణల్లో నిజంలేదని మంత్రి సందీప్​ సింగ్​ చెప్పారు. అయినప్పటికీ నైతికంగా బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆదివారం విడుదల చేసిన వీడియో మెసేజ్​లో ఈ వివరణ ఇచ్చారు. పెహోవా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సందీప్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

జిమ్​లో చూసి ఇష్టపడ్డా అన్నడు : బాధితురాలు

ఇండియన్ నేషనల్ లోక్​దళ్(ఐఎన్ఎల్​డీ) పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​కాన్ఫరెన్స్​లో మహిళా కోచ్ మాట్లాడుతూ..‘‘నేను జూనియర్ అథ్లెట్ కోచ్​గా పనిచేస్తున్నాను. మంత్రి సందీప్ సింగ్ నన్ను ఫస్ట్​ టైం ఒక జిమ్ లో చూశాడు. తర్వాత ఇన్​స్టాలో నాకు మెసేజ్ చేశాడు. నా నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ గురించి క్యాంప్​ ఆఫీస్​లో కలవాలన్నారు. మంత్రి చెప్పిన కొన్ని పేపర్లు తీసుకుని క్యాంప్​ ఆఫీస్​కెళ్లా. అక్కడ నన్ను లైంగికంగా వేధించాడు. అక్కడి నుంచి ఎలాగోలా బయటపడ్డా. ఫిబ్రవరి నుంచి నవంబర్ దాకా వేధించాడు’’ అని బాధితురాలు చెప్పింది.