బీసీల సమగ్ర అధ్యయనం తక్షణ అవసరం : బి.ఎఎస్ రాములు,

బీసీల సమగ్ర అధ్యయనం తక్షణ అవసరం : బి.ఎఎస్ రాములు,

అనంత రామన్ కమిషన్ 1970 నాటి నివేదికలో పొరపాట్లున్నాయని, ఇప్పుడది కాలం తీరిన అధ్యయనం అని  పునరధ్యయనం చేయాలనే అభిప్రాయం ప్రబలంగా ఉంది. ప్రభుత్వాలు , కోర్టులు కూడా ఈ విషయం గుర్తించాయి. అందువల్లే ప్రతి పదేళ్లకు ఒకసారి  బీసీ కమిషన్ వీటిని సమీక్షించాలని నొక్కి చెప్పడం జరిగింది.  అలా 1984 లో మురళీధర్ రావు కమిషన్ ఏర్పడింది. మురళీధర్ రావు కమిషన్ 44 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించింది. దాంతోపాటు కొన్ని కులాలను బీసీల్లో చేర్చాలని సిఫారసు చేసింది. దీనికి అనుకూల వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో  హైకోర్టు పెంచిన రిజర్వేషన్లు కొట్టి వేసింది. దాంతో పాటు కొత్తగా చేర్చాల్సిన కులాలు చేర్చడం ఆగిపోయింది. దాళ్వా సుబ్రహ్మణ్య కమిషన్ కొన్ని కులాలను చేర్చింది.  ఇంకా మిగిలిన కులాలను తెలంగాణ ఏర్పడ్డాక ఏర్పడిన తొలి బీసీ కమిషన్ చేర్చింది. అలా చాలా ఆలస్యంగా 17 కులాలకు బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఇదే సమయంలో  ముదిరాజ్ లను బీసీ డి గ్రూపు నుంచి  ఏ గ్రూపు లో చేర్చడం, తెలంగాణ ఏర్పడ్డాక  తెలంగాణలో లేనివి ఆంధ్రకు పరిమితమైనవని, అనంతరామన్ పేర్కొన్న 26 కులాలను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బీసీ జాబితా నుంచి తొలగించింది. ఈ 26 కులాలు ఆంధ్ర ప్రాంత మూలాలు కలిగి తెలంగాణలో వలస కూలీలుగా, ఉద్యోగులుగా స్థిర పడినాయి.  వీరికి బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో కూడా యధావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తులు వచ్చాయి. 

తెలంగాణ బీసీలకు అన్యాయం జరగొద్దు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని బీసీ కులాల ను తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల జాబితా లో చేర్చాలి అని 26 కులాలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసాయి. సుప్రీమ్ కోర్టు తెలంగాణ బీసీ కమిషన్ నివేదిక కోరింది.  ఈ విషయానికి వస్తే దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో బీసీల లిస్టులు వేరుగా ఉన్నాయి.  సామాజికంగా విద్యాపరంగా కులపరంగా వారి స్థితిగతులననుసరించి  ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, బీసీ కమిషన్లు బీసీల లిస్టులు రూపొందించాయి. వాటిలో మార్పులు చేర్పులు జరుగుతాయి.  దశాబ్దాలుగా ఇలా సాగుతున్నాయి.  ఒకే కులం  అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా లేదు.  లంబాడ మహారాష్ట్ర లో బీసీ...ఎపిలో ఎస్టీ ! రాజస్థాన్ లో ఓసీ! ఇలా ఆయా రాష్ట్రాల్లో  వారి స్థితి ననుసరించి నిర్ణయించబడుతాయి. అలాగే ఆంధ్రాలో బీసీలు తెలంగాణ లో కూడా బీసీలు కానక్కర లేదు. వారు తెలంగాణ బీసీల కన్నా ఎదిగి వున్నారు. సమైక్య రాష్ట్రం లో ఆంధ్ర అవకాశాలతోపాటు తెలంగాణ బీసీల అవకాశాలు అదనంగా ఆక్రమిస్తూ రావడం వల్లనే అభివృద్ధి చెంది తెలంగాణ లో స్థిర పడగలిగారు.  వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా బీసీల కోటా లాక్కోవడం సామాజిక న్యాయం కాదు. వారు తెలంగాణ లోని ఓసీలకు గల 10 శాతం EWS కోటాలో రిజర్వేషన్లు పొందే సౌకర్యం వుంది. 26 ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణ బీసీల జాబితాలో చేర్చడానికి వ్యతిరేకంగా తెలంగాణ బీసీలు గొంతెత్తడం అవసరం. జరిగిందేమంటే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రకు చెందిన 26 బీసీ కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీల లిస్టు నుంచి తొలగించింది. ఆ కులాలు తెలంగాణలో లేకపోవడమే అందుకు కారణం. 1970 లో అనంత రామన్ కమిషన్ ఈ కులాలు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయో పేర్కొని ఆ జిల్లాల్లో బీసీలు గా గుర్తించింది. ఆ జిల్లాలు ఆంధ్ర ప్రాంతానివి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ26 కులాలు తెలంగాణ కు సంబధించినవి కావు కనుక వాటిని తెలంగాణ లిస్టు నుంచి తొలగించడం జరిగింది. తద్వారా తెలంగాణ బీసీల అవకాశాలు మొదటిసారి మొత్తం తెలంగాణ వారికే లభించాయి.  కాబట్టి ఆంధ్ర బీసీలను తెలంగాణ బీసీలుగా గుర్తించడం సమంజసం కాదు. పరోక్షంగా అది తెలంగాణ బీసీలకు జరిగే అన్యాయమే అవుతుంది. అలాగే తెలంగాణ బీసీ కులాల సమగ్ర అధ్యయనం జరిపి వివిధ కులాల డిమాండ్లను పరిష్కరించడం అన్నిటికన్నా అత్యవసరం.

డిమాండ్లు అనేకం, బడ్జెట్​ ఏదీ?

వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం అవసరం.  ఇందుకోసం నేను బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేస్తున్నప్పుడు  బీసీ కులాల సమగ్ర కుటుంబ సర్వే తులనాత్మక అధ్యయనం చేయాలని 9 వ నెంబరు జీవో ఇచ్చింది. అందుకు బడ్జెట్ అడిగితే రాలేదు.  మళ్లీ సర్వే స్టడీ కోసం రెండవ బీసీ కమిషన్ కు జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడైనా బడ్జెట్ ఇస్తే ఆ పని పూర్తి చేసి బీసీల పునర్ వర్గీకరణ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 26 ఆంధ్ర కులాల గురించి, ముదిరాజ్ కుల వర్గీకరణ, తమను యంబీసీ లుగా గుర్తించాలనే వినతుల గురించి తమను బీసీ ఏ గ్రూపు లో చేర్చాలని, ఎల్లాపిని తెలంగాణ బీసీ ఏ గ్రూపు నుంచి తొలగించాలని వినతుల తోపాటు, దొమ్మరి కులం పేరు మార్పు , తమ్మలి నాన్ బ్రాహ్మణ్ అనే పేరులో గల నాన్ బ్రాహ్మణ్ పేరు తొలగింపు, రెడ్డి గాండ్ల కులం బీసీలో చేర్చాలనే వినతుల డిమాండ్లు ఉన్నాయి.   బీసీల అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పన గురించి నివేదిక... మొదలైనవి  సైంటిఫిక్ అధ్యయనంతో సిఫార్సులు చేయడం జరుగుతుంది. విడిగా ఒక్కొక్క సమస్య పై అధ్యయనం గానీ, విడిగా 26 ఆంధ్ర కులాలకు పరిమితమై చేసే అధ్యయనం అసమగ్రంగా, అశాస్త్రీయంగా ఉండిపోయో అవకాశం ఉంది. ఇతర బీసీ కులాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 54 శాతం బీసీల జనాభా కు సరిపడే విధంగా రిజర్వేషన్లు పెంచడం అన్నిటికన్నా ప్రధానం. తమిళనాడు లో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.  తెలంగాణ లో 75 శాతం పైగా రిజర్వేషన్లు అవసరం. క్రీమీ లేయర్  ఎత్తేయాలని, బ్యాక్ లాగ్ పోస్టులు బీసీలతోనే  నింపాల్సి ఉంది. ఇలా అన్నీ కలిసి సమగ్ర తులనాత్మక పరిశీలన పరిశోధన అవసరం.

- బి.ఎఎస్ రాములు,
తెలంగాణ రాష్ట్ర 
బీసీ కమిషన్ మాజీ చైర్మన్