సిట్‌‌ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు

సిట్‌‌ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు
  • సీఎం​కు ఆడియో, వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినయ్​?
  • కీలక వివరాలు బయటకు రావడమేంది? 
  • ఇట్లయితే సిట్​ దర్యాప్తుపై నమ్మకం ఎట్లుంటది? 
  • సిట్​ ఎంక్వైరీ కుదరదు.. 
  • అన్ని డాక్యుమెంట్లను సీబీఐకి అప్పగించాలి
  • కేసు దర్యాప్తును వెంటనే సీబీఐ చేపట్టాలని ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: మొయినాబాద్​ ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​(సిట్​)ను హైకోర్టు రద్దు చేసింది. సిట్​ కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 63ను కొట్టేసింది. కేసు దర్యాప్తును వెంటనే సీబీఐ చేపట్టాలని జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. 

ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. కేసులో కీలక వివరాలను మీడియాకు సీఎం కేసీఆర్​ వెల్లడించడంతో నిందితులు పడుతున్న ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. సిట్​ ఎంక్వైరీ పక్షపాత ధోరణిలో జరుగుతుందన్న నిందితుల వాదనలో అర్థం ఉందని పేర్కొంది. సిట్, మొయినాబాద్‌‌ పోలీసుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్‌‌ అన్నిటినీ సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 

మూడు పిటిషన్లపై తీర్పు

సిట్‌‌ దర్యాప్తు రాజకీయ లక్ష్యంతో సాగుతున్నదని, దర్యాప్తును సీబీఐకి లేదా హైకోర్టు ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 16న వాదనలు పూర్తయ్యాయి. అదే రోజు తీర్పును రిజర్వ్​లో పెట్టిన హైకోర్టు.. సోమవారం తుది తీర్పు వెలువరించింది. 

సిట్‌ కేసులో ప్రధాన నిందితులైన రామచంద్రభారతి, నందుకుమార్‌ కోరే, సింహయాజి కలిసి వేసిన పిటిషన్​తోపాటు అడ్వకేట్​ శ్రీనివాస్​, తుషార్​ వేసిన మరో రెండు పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఇదే అభ్యర్థనతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను  డిస్మిస్‌ చేసింది. క్రిమినల్​ కేసుతో సంబంధం లేని వ్యక్తులు రిట్‌ దాఖలు చేసేందుకు వీల్లేదని..  కేసులో బాధితులు, నిందితులు, ప్రతివాదులు, దర్యాప్తు అధికారులు మాత్రమే పిటిషన్​ వేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ మేరకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ కూడా ఉన్నాయని హైకోర్టు గుర్తుచేసింది. ఈ కారణాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే బీజేపీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.  

తీవ్రంగా పరిగణిస్తున్నం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్‌ దర్యాప్తుకు ముందే సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో ఆ ఘటనకు చెందిన ఆడియో, వీడియో ఫుటేజీలను మీడియాకు రిలీజ్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కేసు దర్యాప్తుకు సంబంధించిన మెటీరియల్స్‌ దర్యాప్తు అధికారుల నుంచి పాలకులకు చేరరాదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చిందని గుర్తుచేసింది. ‘‘ కేసుకు చెందిన కీలక వీడియోల క్లిప్పింగ్స్‌ సీఎం మీడియా సమావేశంలో చెప్పారు. 

ఆ మెటీరియల్‌ సీఎంకు ఎలా వచ్చిందో సిట్‌ చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. కౌంటర్‌లోనూ ప్రస్తావించలేదు. ఫిర్యాదుదారు రోహిత్‌రెడ్డి ఇచ్చి ఉండొచ్చునని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ జె. రామచంద్రరావు విచారణలో చెప్పారేగానీ కౌంటర్‌లో సిట్‌ చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆ కేసు నిందితులకు దర్యాప్తుపై ఉన్న భయాందోళనకు అర్థం ఉంటుంది. నిందితులకు కూడా హక్కుల ఉంటాయి. వాళ్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది” అని పేర్కొంది.  అందుకే, ఇక మీదట ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సిట్‌కు ఆదేశాలు ఇస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం మెటీరియల్, డాక్యుమెంట్స్‌ సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. 

మొయినాబాద్​ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 455/2022 చెందిన అన్ని వివరాలు సీబీఐకి ఇవ్వాలని ఆర్డర్​ వేసింది. కేసులో సిట్‌ దర్యాప్తు చెల్లదని, సిట్​కు ముందు మొయినాబాద్‌ పోలీసులు చేపట్టిన దర్యాప్తు కూడా చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. ‘‘ముఖ్యమంత్రికి ఎవరు మెటీరియల్, వీడియో రికార్డింగ్‌లు ఇచ్చారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లలో కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించవద్దని కోర్టు చెప్పినా.. రోజూవారీ విచారణ వివరాలు వారికి ఎలా తెలిశాయన్న నిందితుల వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఆ కీలక వివరాలన్నీ లీక్‌ అయ్యాయి. 

వివరాలు బహిర్గతం కావడం పోలీస్‌ దర్యాప్తుపై నిందితులకు అనుమానం కలిగేలా చేసింది”అని పేర్కొంది. నిందితులకు కూడా రాజ్యాంగంలోని 20, 21 ప్రకారం రక్షణ హక్కులు ఉంటాయని తెలిపింది. ఘటనకు చెందిన వీడియోలు, ఆడియోలు, ఫొటోలు దర్యాప్తుకు ముందే బయటకు రావడంతో సిట్‌ దర్యాప్తు పక్షపాతంగా ఉందన్న నిందితుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. 

ఇయ్యాల సిట్​ అప్పీల్​ పిటిషన్​!

తీర్పు వెలువడిన వెంటనే సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కల్పించుకొని.. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని, తీర్పు కాపీ అందే వరకు  ఈ తీర్పు అమలును నిలిపివేయాలని కోరారు. ఇందుకు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి అనుమతిచ్చారు. మంగళవారమే సిట్‌ అప్పీల్‌ చేయనుందని, బుధవారం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారణ చేసే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.

సిట్‌‌ దర్యాప్తుకు ముందే సీఎం కేసీఆర్‌‌ మీడియా సమావేశంలో ఆడియో, వీడియో ఫుటేజీలను రిలీజ్‌‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నం. వీడియో, ఆడియో రికార్డింగ్స్​ను  సీఎంకు ఎవరిచ్చారో సిట్‌‌ నుంచి క్లారిటీ లేదు. దర్యాప్తు సమాచారాన్ని పంచుకోడానికి వీల్లేదు. కానీ, ప్రాథమిక దశలోనే కీలక సమాచారం బహిర్గతం కావడం ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే సిట్​ నుంచి సీబీఐకి దర్యాప్తును బదిలీ చేస్తున్నం. - హైకోర్టు