టీఎస్‌ఆర్‌టీసీ విలీనం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్న 43వేల మంది

టీఎస్‌ఆర్‌టీసీ విలీనం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్న 43వేల మంది

కేబినెట్ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం (జులై 31న) మంత్రివర్గ మండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం సమావేశమై చర్చించింది. టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో కూడిన ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ చెప్పారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రజారవాణాను పటిష్టం చేసేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్  తెలిపారు. గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె చేశారని, వారి కోరికను మన్నిస్తూ.. సామాజిక బాధ్యతగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా గుర్తిస్తూ.. అధికారులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

సబ్‌ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆగస్టు 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది.