సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌పై 24న నిర్ణయం తీసుకుంటం.. ఈడీకి చెప్పిన సీబీఐ స్పెషల్ కోర్టు

సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌పై 24న నిర్ణయం తీసుకుంటం.. ఈడీకి చెప్పిన సీబీఐ స్పెషల్ కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌లో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 24న నిర్ణయం తీసుకుంటామని సీబీఐ స్పెషల్ కోర్టు తెలిపింది. నిందితులుగా పేర్కొన్న రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా, మాగుంట రాఘవలకు చార్జ్‌‌‌‌షీట్ పత్రాలను అందజేయాలని ఈడీ అధికారులను సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్ శనివారం ఆదేశించారు. లిక్కర్ స్కామ్‌‌‌‌లో మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించి గతేడాది నవంబర్ 26న తొలి చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ను, జనవరి 6న సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ను ఈడీ దాఖలు చేసింది.

ఇటీవల సేకరించిన మరిన్ని ఆధారాలు, స్టేట్‌‌‌‌మెంట్లతో ఈ నెల 6న రెండో సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ను ఫైల్ చేసింది. ఇందులో ఒయాసిస్ గ్రూప్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రా, చారియట్ అడ్వర్టయిజింగ్ డైరెక్టర్ రాజేశ్​ జోషి, ఎన్రికా ఎంటర్‌‌‌‌‌‌‌‌ ప్రైజెస్ ఓనర్ మాగుంట రాఘవ పాత్రలను ప్రస్తావించింది. గౌతమ్ మల్హోత్రాను ఫిబ్రవరి 7న, రాజేశ్​జోషిని ఫిబ్రవరి 8న, మాగుంట రాఘవను ఫిబ్రవరి 10న అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.

మాగుంట బెయిల్ పిటిషన్‌‌‌‌పై తీర్పు వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌ కేసులో నిందితునిగా తీహార్ జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు మాగుంట రాఘవ రెడ్డి బెయిల్ పిటిషన్‌‌‌‌పై తీర్పును ఈనెల 20న వెల్లడిస్తామని సీబీఐ స్పెషల్ కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌లో ఫిబ్రవరిలో అరెస్టయిన రాఘవ రెడ్డి రిమాండ్‌‌‌‌ను కోర్టు పొడిగిస్తూ వస్తున్నది. అతడు దాఖలు చేసిన బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై కోర్టు మార్చి 25న విచారణ ముగించింది. తీర్పును ఏప్రిల్ 6కు రిజర్వ్ చేశారు. ఏప్రిల్ 6న స్పెషల్ జడ్జి సెలవులో ఉండడంతో తీర్పును శనివారానికి వాయిదా వేశారు. శనివారం ఇతర కేసుల్లో నిమగ్నమై ఉన్నందున తీర్పుపై దృష్టి సారించలేదని జడ్జి నాగ్‌‌‌‌పాల్ వెల్లడించారు. ఈ నెల 20న తీర్పు వెల్లడిస్తామని చెప్పారు.