ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి పండ్లను పండించి హౌరా అనిపించాడు నిర్మల్ జిల్లాలోని ఓ ఆయుర్వేద వైద్యుడు రాపల్లి సత్యం. నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేటలో తనకున్న సత్యం ట్రెడిషనల్ ఆయుర్వేద, యోగాశ్రమంలో అరుదైన మామిడి పండ్లను పండించి రికార్డు సృష్టించాడు. కిలో 50 వేల రూపాయలు ఉండే పండ్లను పండించారనే వార్త జిల్లా వ్యాప్తంగా రైతులలో ఆసక్తిని పెంచుతోంది.
రాపల్లి సత్యం వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సాంప్రదాయ పద్ధతిలో భాగంగా ప్రకృతి సిద్ధంగా లభించే పలు ఆయుర్వేద మొక్కలు వాటి వేర్లు, ఆకులతో ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన ఒక ఎకరం 10 గుంటల ఆశ్రమ ప్రాంగణంలో వివిధ జాతుల పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. అందులో భాగంగానే 2 సంవత్సరాల క్రితం జపాన్ దేశానికి చెందిన మియాజాకీ రకం మొక్కలను నాటారు. ఒక్కోటి 10 వేల రూపాయల చొప్పున 10 మొక్కలను కలకత్తా నుంచి తెప్పించారు. మొత్తం లక్ష రూపాయలు వెచ్చించి పది మొక్కలను కొనుగోలు పెంచారు.
కేవలం శీతల ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్క ఇక్కడ రక్షించడం సవాల్ గా తీసుకున్న ఆయన 6 మొక్కలు బతికించి ఔరా అనిపించాడు. ఈ మొక్కలు ఈ ఏట ఖాతకు రావడంతో ఈ మియాజకి మామిడి పండ్లను చూడడానికి కడెం మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు వచ్చి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెట్టు మీద పండిన ఈ పళ్ళను కొన్ని నియోజకవర్గ జిల్లా ప్రముఖులకు అందజేసినట్లు ఆయుర్వేద వైద్యుడు సత్యం తెలిపారు.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కిరోటిన్, ఫోలిక్ యాసిడ్ వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర రెండున్నర నుండి మూడు లక్షలు ఉన్నప్పటికీ, కమర్షియల్ గా కాకుండా ఆశ్రమం వచ్చే వారికి వైద్యం అందించేందుకు పెంచుతున్నట్లు తెలిపారు.
ఈ రకం మొక్కలు మన ప్రాంతంలో బతకడానికి అవకాశం ఉన్నందున రైతులు ఈ జాతి మొక్కలను తెప్పించి నాటితే లాభాలు వస్తాయని చెబుతున్నారు. కిలో 50,000 పలికినా మంచి డిమాండ్తో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్కో మొక్క ధర మార్కెట్లో తక్కువనే ఉందని రైతులు ఈ రకం మొక్కలపై దృష్టి సారించాలని కోరారు.
