ఢిల్లీలో వైర‌స్ బారిన‌ప‌డిన క‌రోనా వార్డు డాక్ట‌ర్

ఢిల్లీలో వైర‌స్ బారిన‌ప‌డిన క‌రోనా వార్డు డాక్ట‌ర్

ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్ గంజ్ హాస్పిట‌ల్ లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు డాక్ట‌ర్ల‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఒకరు క‌రోనా వార్డులో పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ వైర‌స్ సోకిన పేషెంట్ల‌కు చికిత్స అందించే వైద్యులు త‌మ ర‌క్ష‌ణ కోసం ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్ ధ‌రిస్తారు. అయిన‌ప్ప‌టికీ ఆ డాక్ట‌రుకి వైర‌స్ రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న‌కు ఆస్ప‌త్రిలో వైర‌స్ సోకిందా? లేక ఇత‌ర కాంటాక్ట్ ద్వారా ఏమైనా వ‌చ్చిందా అన్న‌దానిపై అధికారుల నుంచి స‌మాచారం రావాల్సి ఉంది. మ‌న దేశంలో క‌రోనా వార్డులో సేవ‌లు అందిస్తున్న ఓ డాక్ట‌ర్ కు వైర‌స్ సోకిన తొలి కేసు ఇదేన‌ని తెలుస్తోంది.

ఇక ఇవాళ క‌రోనా బారిన‌ప‌డిన రెండో వ్య‌క్తి థ‌ర్డ్ ఇయ‌ర్ పీజీ చ‌దువుతూ స‌ఫ్ద‌ర్ గంజ్ ఆస్ప‌త్రిలో సేవ‌లు అందిస్తున్న మ‌హిళా రెసిడెంట్ డాక్ట‌ర్ అని తెలిపారు అధికారులు. కొద్ది రోజుల క్రితం ఆమె విదేశీ ప్ర‌యాణం చేసి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఆమె ఫారెన్ నుంచి తిరిగి వ‌చ్చాక ఎవ‌రెవ‌రిని క‌లిశారు? అమె ద‌గ్గ‌ర ట్రీట్మెంట్ కోసం వ‌చ్చి పేషెంట్ల వివ‌రాల‌ను సేక‌రించి వారంద‌రినీ క్వారంటైన్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ఢిల్లీ అధికారులు తెలిపారు. ఇవాళ క‌రోనా సోకిన ఈ ఇద్ద‌రు డాక్ట‌ర్ల కుటుంబ‌స‌భ్యుల‌ను ముందు జాగ్ర‌త్త‌గా క్వారంటైన్ చేశామ‌న్నారు. కాగా, ఢిల్లీలో బుధ‌వారం నాటికి క‌రోనా కేసుల సంఖ్య 123కి చేరింది.

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా త‌మ సేవ‌లు అందిస్తున్న‌ డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బందికి జీవిత బీమా క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది ఢిల్లీ స‌ర్కార్. క‌రోనా పేషెంట్ల ప్రాణాల‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో వైద్య సిబ్బందికి హాని జ‌రిగి మ‌ర‌ణిస్తే వారి సేవ‌ల‌ను గౌర‌విస్తూ ఆ బాధితుల కుటుంబాల‌కు రూ. కోటి అంద‌జేస్తామ‌ని చెప్పారు సీఎం కేజ్రీవాల్. ఇది ప్ర‌భుత్వ వైద్యులే కాక ప్రైవేటు వారికి కూడా వ‌ర్తిస్తుంద‌ని తెలిపారాయ‌న‌. కాగా, ఇప్ప‌టికే డాక్ట‌ర్లు, నర్సులు, ఇత‌ర వైద్య సిబ్బందికి రూ.50 ల‌క్ష‌ల జీవిత బీమాను క‌ల్పిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.