భారత్, పాక్ సరిహద్దుల్లో డ్రోన్..కూల్చేసిన బీఎస్ఎఫ్

 భారత్, పాక్ సరిహద్దుల్లో డ్రోన్..కూల్చేసిన బీఎస్ఎఫ్

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా రజతల్‌ గ్రామంలో  బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అక్రమ డ్రోన్‌ను గుర్తించారు. భారత్‌- పాక్‌ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఆదివారం రాత్రి 7.40 గంటలకు పాకిస్థాన్‌ నుంచి భారత భూభాగంలోకి ఎగురుతూ వస్తున్న డ్రోన్‌ను గుర్తించారు. డ్రోన్ ను  స్వాధీనం చేసుకున్న బలగాలు..దాంతో ఏవైనా వస్తువులను పంపారా..అనే కోణంలో పరిసర ప్రాంతాల్లో  గాలిస్తున్నారు. 

మరోవైపు భారత్, పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే పాకిస్తానే  డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 24 వ తేదీన అమృత్‌సర్‌ సెక్టార్‌లోని సరిహద్దుల్లో పాక్‌ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్‌ను జవాన్లు కూల్చివేశారు.  అంతకుముందు కూడా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు డ్రోన్లను కూల్చేశారు. పాక్ నుంచి వచ్చే డ్రోన్‌లను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం గద్దలకు ఇప్పటికే ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తోంది.  వీటిసాయంతోనే  డ్రోన్‌లను గాల్లోనే ధ్వంసం చేయనున్నారు.