రాజకీయ కోణంలో తప్పుడు ప్రకటన చేశారు

రాజకీయ కోణంలో తప్పుడు ప్రకటన చేశారు

హైదరాబాద్, వెలుగు:  నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి పని చేయించాల్సిన నీతి ఆయోగ్,  బీజేపీ ప్రభుత్వానికి వంతపాడుతూ నోట్ రిలీజ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. హైదరాబాద్​లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆదివారం మంత్రి హరీశ్​ రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి.. రాజకీయ కోణంలో తప్పుడు ప్రకటన చేశారని విమర్శించారు. ఆ సంస్థ అంకెలా గారడీ చేస్తూ.. వాస్తవాలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరు చేయాలని ఎన్ని లెటర్లు రాసినా ఇవ్వలేదన్నారు. రూ.3,922 కోట్లు కేటాయించి.. అందులో రూ.200 కోట్లు ఇచ్చి నిధులు వాడుకోలేదని నీతి ఆయోగ్ తప్పుడు ప్రకటన చేసిందని విమర్శించారు. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు మొత్తంగా రూ.24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని నీతి ఆయెగ్ సిఫార్సు చేసినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని.. ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

గత ప్రభుత్వాలు అమలు చేశాయ్..

ఇందిరాగాంధీ, వాజ్​పేయ్, మన్మోహన్ ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేశాయని హరీశ్​ రావు గుర్తు చేశారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సులను మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదని.. దానిపై నీతి ఆయోగ్ ఎందుకు ప్రశ్నించదని అడిగారు. కేంద్రం సెస్​లను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు నిధులు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్​ల ద్వారా కేంద్రం ఇప్పటి దాకా రూ.15.47 లక్షల కోట్లు సమకూర్చుకుందని.. అందులో రాష్ట్రాల వాటా రూ.8.60 లక్షల కోట్లు రావాలన్నారు. 2015–16లో సీఎస్ఎస్ (సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్)తో రూ.6వేల కోట్లు వచ్చాయన్నారు. 2016–-17రూ.6,695 కోట్లు వచ్చాయి. అయితే గతేడాది రూ.5,223 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. డబుల్ ఇస్తున్నారని చెప్పిన నీతి ఆయోగ్ దీనికి సమాధానం చెప్పాలన్నారు.  

29.60 శాతం నిధులే వస్తున్నయ్..

‘‘రాష్ట్రాలకు 42 శాతం వరకు నిధులు ఇచ్చామని నీతిఆయోగ్ చెప్పింది. ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రాలకు 42 శాతానికి పెంచామని ప్రకటించింది. 42 శాతం నిధులివ్వడం లేదు. 29.6 శాతమే వస్తున్నాయని కాగ్​ చెబుతున్నది” అని హరీశ్​ రా వు స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులు హరించుకుపోతుంటే.. సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ పోయిందని ప్రశ్నిం చారు.  పీఎం గ్రామ్​ సడక్​ యోజన, ఐసీడీఎస్​ వంటి స్కీం లకు వంద శాతం నిధులు ఇచ్చే కేంద్రం.. ఇప్పుడు దాన్ని 60శాతానికి తగ్గించుకుందన్నారు. ఫలితంగా రాష్ట్రాలపై భారం మోపిందని విమర్శించారు.