అధిక వడ్డీ పేరుతో రూ.200 కోట్ల మోసం

అధిక వడ్డీ పేరుతో రూ.200 కోట్ల మోసం
  • భార్యాభర్తలు, కొడుకు అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: అధిక వడ్డీలు వస్తాయని ఆశ చూపి రూ.200 కోట్లు కొట్టేసిన కేసులో తెలంగాణ స్టేట్ కోపరేటివ్ ఆపెక్స్ బ్యాంకు జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణి బాల, ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ ఎన్.శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మగడ్డ వాణి బాల అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోపరేటివ్ ఆపెక్స్ బ్యాంకులో జనరల్ మేనేజర్​గా పనిచేస్తుండగా, ఆమె భర్త నేతాజీ అబిడ్స్ లో శ్రీప్రియాంక గ్రాఫ్ టెక్ పేరుతో కంపెనీ నడుపుతున్నాడు. వీరి కొడుకు శ్రీహర్ష కంపెనీ డైరెక్టర్​కొనసాగుతున్నాడు.

అయితే శ్రీప్రియాంక గ్రాఫ్​టెక్​కంపెనీలో ఇన్వెస్ట్​చేస్తే అధిక వడ్డీ వస్తుందని జీఎం వాణిబాల బ్యాంక్​సిబ్బంది, కస్టమర్లకు ఆశ చూపేది. నిజమని నమ్మిన పలువురు దాదాపు రూ.200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొదట్లో ఒక్కొక్కరు కట్టిన మొత్తానికి నెలకు 24 శాతం వడ్డీ చెల్లించడంతో, మరికొంత మందితో ఇన్వెస్ట్ చేయించారు.

ఈ ఏడాది జనవరి తర్వాత ఇన్వెస్టర్లకు ఎలాంటి వడ్డీలు చెల్లించకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండుకు తరలించారు.