ఫైనాన్స్‌‌ వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్య...సిద్దిపేట రూరల్‌‌ మండలంలో విషాదం

ఫైనాన్స్‌‌ వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్య...సిద్దిపేట రూరల్‌‌ మండలంలో విషాదం

సిద్దిపేట రూరల్, వెలుగు : అప్పు కట్టాలని ఫైనాన్స్‌‌ సంస్థల ప్రతినిధులు ఇంటికొచ్చి గొడవ చేయడంతో అవమానం తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట రూరల్‌‌ మండలంలోని చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువులో ఆదివారం జరిగింది. రూరల్‌‌ ఎస్సై రాజేశ్‌‌, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... 

చింతమడక గ్రామానికి చెందిన రాందేని శ్రీనివాస్‌‌ (45) భార్య రేణుక, ఇద్దరు కొడుకులతో కలిసి వ్యవసాయం చేయడంతో పాటు ఓ హోటల్‌‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయ పెట్టుబడులు, కుటుంబ ఖర్చుల కోసం వివిధ ఫైనాన్స్‌‌ సంస్థల వద్ద రూ. 10 లక్షల వరకు అప్పు చేశాడు. 

అప్పు కట్టకపోవడంతో ఫైనాన్స్‌‌ సంస్థల ప్రతినిధులు శ్రీనివాస్‌‌కు చెందిన ట్రాక్టర్‌‌తో పాటు బైక్‌‌ను ఇటీవల లాక్కెళ్లారు. అలాగే ఆదివారం ఉదయం శ్రీనివాస్‌‌ ఇంటికి వచ్చి గొడవ చేశారు. అవమానంగా భావించిన శ్రీనివాస్‌‌ సాయంత్రం పొలం వద్దకు వెళ్లి ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.