న్యాయం చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం

న్యాయం చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం

సాగు చేసుకుంటున్న  భూమిని సింగరేణి సంస్థ  తీసుకొని తమను రోడ్డు పాలు చేసిందంటూ బాధితుడు, అతని కూతురు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లేపల్లిలో జరిగింది. బాధితుడు ఆత్మహత్యకు యత్నించడం ఇది మూడోసారి. మల్లేపల్లిలోని 376  సర్వే నంబరులోని భూమిని సింగరేణి సంస్థ పదేళ్ల కిందట అధీనంలోకి తీసుకుంది.  నాలుగేళ్ల క్రితం రైతులకు పరిహారం అందజేసి పనులు  ప్రారంభించింది.  సంస్థ ఇచ్చే పరిహారం తమకు సరిపోదంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్న భూములకు సంబంధించిన రైతు బంధు చెక్కులను గత సంవత్సరం రెవెన్యూ ఆఫీసర్లు రైతులకు అందజేశారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు తర్వాత చెక్కులు పోయాయంటూ వాటిని మాయం చేశారు.  పరిహారం చెల్లించకుండా తమ భూమిలో సింగరేణి సంస్థ పనులు నిర్వహించడానికి వీల్లేదంటూ గత సంవత్సరం ఆగస్టులో నిర్వాసిత గిరిజన, గిరిజనేతర రైతులు 32 మంది ఆందోళనకు దిగారు. తమ 81 ఎకరాలకు పరిహారం చెల్లించాలంటూ 15 రోజులపాటు గనిలో పనులను అడ్డుకున్నారు.

అప్పట్లో  సింగరేణి, రెవెన్యూ ఆఫీసర్లు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  ఆ హామీ నెరవేర్చకపోవడంతో ఈ సంవత్సరం  ఫిబ్రవరిలో మరోసారి ఆందోళన నిర్వహించారు.  ఆ సమయంలో  తనకు సంబంధించిన ఆరు ఎకరాల భూమికి పరిహారం అందడం లేదంటూ నిర్వాసిత రైతు కందిమళ్ల నరసింహారావు పురుగుల మందు తాగారు. స్పృహ తప్పి పడిపోయిన అతడిని తోటి రైతులు హాస్పిటల్​కు తరలించారు. 15 రోజులు దవాఖానాలోనే ఉన్నారు. ఈ క్రమంలో దిగివచ్చిన యాజమాన్యం నరసింహారావు కుటుంబానికి  న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర నిర్వాసితులకు పరిహారం అందజేశారు. నరసింహారావుకు తక్కువ భూమి ఉన్నట్లు చూపుతుండడం, ఆఫీసర్లు తనను ఆఫీస్​చుట్టూ తిప్పిస్తుండడంతో అతడు విసిగిపోయాడు. ఈ నెల 22న మరోమారు ఆత్మహత్యకు యత్నించగా చుట్టుపక్కలవారు అడ్డుకున్నారు. మళ్లీ సింగరేణి ఆఫీసర్లు వచ్చి నచ్చజెప్పారు. అయినప్పటికీ తన సమస్య పరిష్కరించకపోవడంతో మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి  సింగరేణి గనిలో ఆత్మహత్య చేసుకుంటానంటూ వచ్చారు. ఈ క్రమంలో నరసింహారావు కుమార్తె సునీత  సింగరేణి  ఓబీ కుప్పలపై ఎక్కి నెయిల్​పాలిష్​ తాగేందుకు యత్నించింది. తోటివారు ఆమెను అడ్డుకున్నారు.

విషయం తెలుసుకున్న మణుగూరు తహసీల్దారు ప్రకాష్​రావు,  మల్లేపల్లి ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్​లలిత్ కుమార్, ఇతర  సింగరేణి ఆఫీసర్లు సంఘటన స్థలానికి వచ్చి నరసింహారావు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సునీతను మణుగూరు ఏరియా సింగరేణి హాస్పిటల్​కు తరలించారు. మణుగూరు తహసీల్దారు మాట్లాడుతూ విషయం సబ్​కలెక్టర్​దృష్టికి తీసుకెళ్లామని, సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారన్నారు.