సంక్రాంతి పండుగకు ఊర్లకెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

సంక్రాంతి  పండుగకు ఊర్లకెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి  :  పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు : సంక్రాంతి పండుగకు ఊర్లకెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని తెలిపారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని, లేదా బ్యాంకు లాకర్ లో దాచి పెట్టుకోవాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్, బీట్ గస్తీకి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 

చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు..

ప్రజలు, పక్షులకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. చైనా మాంజా ఉపయోగించి గాలి పటాలను ఎగుర వేసేందుకు యువత ఆసక్తి చూపుతుందని, దాన్ని వల్ల ప్రమాదం పొంచివుందని తెలిపారు. చైనా మాంజా నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.