అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు కరెంట్ షాక్

అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు కరెంట్ షాక్

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ రైతు విద్యుద్ఘాతానికి గురైన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది. గడిసింగాపూర్ గ్రామానికి చెందిన మురళీధర్ రెడ్డి అనే రైతుకు తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు.  గత రెండు మూడు రోజుల నుండి విద్యుత్ సరఫరా సరిగ్గా లేదని... విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానిక రైతులు చెబుతున్నారు.

తను వేసిన వరి పంట ఎండిపోయే దశకు చేరింది. అధికారులు స్పందించకపోవడంతో తోటి రైతులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్ళాడని స్థానికులు చెబుతున్నారు.  విద్యుత్ షాక్ కు గురైన మురళీధర్ రెడ్డిని  వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు ప్రమాదానికి గురయ్యాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా లో వోల్టేజ్ తో పాటు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఉందని.. ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్ బాగు చేసి తమకు నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతులు కోరుతున్నారు.