విద్యావంతుల దేశాల జాబితాలో మనం ఎక్కడ?

విద్యావంతుల దేశాల జాబితాలో మనం ఎక్కడ?

దేశ సమగ్రాభివృద్ధి,  దేశ పౌరుల ఉన్నత జీవన విధానాలు ఆ దేశంలో ఉన్న విద్యావంతుల మీదనే ఆధారపడి ఉంటాయి.  ఉన్నత విద్యార్హతలు కలిగిన శ్రామికశక్తి ద్వారా దేశంలో ఉత్పత్తులు బాగా పెరగడం, ఇన్నొవేషన్‌‌ సామర్థ్యాలు అధికంగా కలిగి ఉండడం, దేశ ఆర్థికా భివృద్ధిలో భాగస్వామ్యం పెరగడం జరుగుతుంది.

  ప్రపంచ దేశాల్లో అత్యధిక విద్యావంతులు కలిగిన దేశాలతో పాటు, ఆ దేశ జనాభాలో యూనివర్సిటీ డిగ్రీ లేదా ఆపై చదువులు చదివిన 25 -64 ఏండ్ల వయస్సు కలిగిన విద్యావంతుల శాతం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాను తాజాగా ‘సీబీఆర్ఈ రీసెర్చ్’‌‌ సంస్థ శాస్త్రీయంగా అధ్యయనం చేసి విడుదల చేసింది. 

యూనివర్సిటీ డిగ్రీ లేదా ఆపై విద్యార్హతలు కలిగిన జనాభా అభివృద్ధి చెందిన దేశాల్లో అధికంగా నమోదు కావడం, అభివృద్ధి చెందుతున్న అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో విద్యావంతుల శాతం తక్కువగా నమోదు అవుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక విద్యావంతుల శాతం నమోదు చేసిన దేశంగా 52.4 శాతం జనాభాతో  ఐర్లాండ్‌‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 

ఐర్లాండ్‌‌ జనాభాలో 1.8 మిలియన్ల విద్యావంతులు ఉండగా, ఆ దేశ జనాభాలో వీరి శాతం 52.4 శాతంగా నమోదైంది. 2వ స్థానంలో 46 శాతంతో స్విట్జర్లాండ్ (2.7 మిలియన్ల విద్యావంతులు)‌‌, 3వ స్థానంలో 45 శాతంతో సింగపూర్‌‌ (1.9 మిలియన్లు), 4వ స్థానంలో 44.1 శాతంతో బెల్జియం (3.3 మిలియన్లు), 5వ స్థానంలో 43.6 శాతంతో యూకే (19.1 మిలియన్లు), 6వ స్థానంలో 42 శాతంతో నెథర్లాండ్‌‌ (4.8 మిలియన్లు), 7వ స్థానంలో 40.3 శాతంతో యూఎస్‌‌ (78.2 మిలియన్లు), 8వ స్థానంలో 39.8 శాతంతో ఆస్ట్రేలియా (6.9 మిలియన్లు), 9వ స్థానంలో 39.7 శాతంతో ఇజ్రాయిల్‌‌ (2.2 మిలియన్లు), 10వ స్థానంలో 39.6 శాతంతో స్వీడన్‌‌ (2.6 మిలియన్ల విద్యావంతులు) నమోదు అయ్యారు. 

35వ స్థానంలో ఇండియా

అత్యధికశాతం విద్యావంతులు ఉన్న దేశాల జాబితాలో 35వ స్థానంలో 14.2 శాతంతో ఇండియా 139.4 మిలియన్ల విద్యావంతులను కలిగి ఉన్నది.  అదేవిధంగా 36వ స్థానంలో 6.9 శాతంతో మెయిన్ ల్యాండ్‌‌  చైనా 88.1 మిలియన్ల విద్యావంతులను కలిగి ఉన్నది.  అత్యధికశాతం విద్యావంతులు కలిగిన తొలి 10 దేశాల్లో ఆరుదేశాలు యూరోప్‌‌కు చెందినవిగా గమనించాలి.  

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌‌  విద్యావంతుల శాతంలో మాత్రం 14.2 శాతంతో 35వ స్థానంలో నిలిచిందని గమనించాలి. 11 నుంచి 20 స్థానాలను ఆక్రమించిన ప్రముఖ దేశాల్లో దక్షిణ కొరియా (39.4 శాతం), కెనడా (36.9 శాతం), జపాన్‌‌ (34.8 శాతం), జర్మనీ (32.9 శాతం) దేశాలు ఉన్నాయి. అదే విధంగా 21 నుంచి 30 స్థానాలను ఆక్రమించిన ప్రముఖ దేశాల్లో  స్పెయిన్‌‌ (28.8 శాతం),  ఫ్రాన్స్‌‌(28.1 శాతం),  బ్రెజిల్‌‌ (21.5 శాతం), ఇటలీ (21.5 శాతం) ఉన్నాయి.  భారత జనాభా 1.45 బిలియన్లు ఉండగా,  ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి 28.4 శాతం మాత్రమే ఉన్నది. 2035 నాటికి ఈ నిష్పత్తిని 50 శాతానికి పెంచడానికి పథకాలు అమలు చేయడం జరుగుతోంది. 

 -  డా. బుర్ర మధుసూదన్ రెడ్డి