
మియాపూర్, వెలుగు: వ్యాపారంలో తమ కంటే బాగా సంపాదిస్తున్నాడని ఓ కర్రల వ్యాపారిని కత్తితో పొడిచి హత్య చేసిన నలుగురు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా జంగమయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ (36) భార్య, పిల్లలతో కలిసి హఫీజ్ పేట్‌లో నివాసముంటున్నారు. ఐదు సంవత్సరాలుగా హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్ సమీపంలో కర్రల వ్యాపారం చేస్తున్నాడు.
శ్రీనివాస్ షాప్ పక్కనే హఫీజ్ పేట్‌కి చెందిన ఎస్.కె. మొయిజ్ కర్రల బిజినెస్ చేస్తున్నాడు. వ్యాపారంలో తన కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని శ్రీనివాస్ పై మొయిజ్ కక్ష పెంచుకున్నాడు. శ్రీనివాస్‌ని హత్య చేస్తే తన వ్యాపారానికి ఢోకా ఉండదని ప్లాన్ చేశాడు. ఇందుకోసం తన మేనల్లుడు సాహిల్, షాప్ లో పనిచేసే మక్బుల్, ఆటో డ్రైవర్ అన్వర్ సాయం తీసుకున్నాడు.
నలుగురు కలిసి ఈనెల 2 మధ్యాహ్నం1.30 గంటలకు షాప్ లో ఉన్న శ్రీనివాస్‌తో గొడవపడ్డారు. ఈ క్రమంలో మొయిజ్, అన్వర్, మక్బుల్ ముగ్గురు శ్రీనివాస్‌ని పట్టుకోగా సాహిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీనివాస్ కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో శ్రీనివాస్ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు ప్రధాన నిందితుడు మొయిజ్, సాహిల్, మక్బుల్, అన్వర్‌లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.