చిన్న పిల్లల మధ్య గొడవ.. తండ్రి ప్రాణం తీసింది.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఘటన

చిన్న పిల్లల మధ్య గొడవ.. తండ్రి ప్రాణం తీసింది.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఘటన
  • ఇంటి ముందు ఆడుకుంటూ కొట్టుకున్న పిల్లలు
  •     పిల్లలకు సర్దిచెప్పిన ఓ తండ్రి
  •     ఈ విషయంలో గొడవపడ్డ 
  • ఇరు కుటుంబాలు
  •     కాసేపటికి ఛాతిలో నొప్పితో చనిపోయిన సయ్యద్ అమీర్


ఘట్​కేసర్, వెలుగు: చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ.. ఒకరి తండ్రి మరణానికి దారితీసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​లోని ఔషపూర్​లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఔషపూర్​లో సయ్యద్ అమీర్, సయ్యద్ అలీ కుటుంబాలు ఎదురెదురుగా నివాసం ఉంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నం అమీర్ ఇంటి ముందు అతని పిల్లలు హసీనా, అంజద్, సయ్యద్ అలీ పిల్లాడు అబూ ఆడుకుంటూ గొడవపడ్డారు. 

ఈ క్రమంలో సయ్యద్ అమీర్.. పిల్లలకు సర్దిచెప్పి స్నేహ పూర్వకంగా ఉండాలని మందలించాడు. దీంతో అబూ.. తన ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తండ్రి సయ్యద్ అలీకి చెప్పగా, ఆగ్రహానికి గురై అమీర్​తో గొడవపడ్డాడు. ఇద్దరు కొట్టుకున్నారు. స్థానికులు గమనించి ఇద్దరిని విడిపించి తమ తమ ఇండ్లకు పంపించారు. అర గంట తర్వాత సయ్యద్ అమీర్​కు ఛాతి నొప్పి, వాంతులై స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఘట్​కేసర్ లోని ఓ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. 

పరీక్షించిన డాక్టర్లు.. సయ్యద్ అమీర్ అప్పటికే చనిపోయాడని తెలిపారు. అమీర్ భార్య సోనీ తన భర్త మరణానికి సయ్యత్ అలీతో జరిగి గొడవే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్​కు తరలించారు. అనంతరం.. సయ్యద్ అమీర్ డెడ్​బాడీతో అతని కుటుంబ సభ్యులు ఔషాపూర్ చేరుకున్నారు. సయ్యద్ అలీని కఠినంగా శిక్షించాలని, నష్టపరిహారంగా రూ.20 లక్షలు ఇవ్వాలని గొడవకు దిగారు. ఎవరూ స్పందించకపోవడంతో జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కొన్ని కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. చివరికి  పోలీసులు  ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు.