కోరుట్ల ఆర్టీసీ డిపోలో మంటలు

కోరుట్ల ఆర్టీసీ డిపోలో మంటలు
  • షార్ట్ సర్క్యూట్‌‌తో కాలిపోయిన రాజధాని బస్సు 
  •     డీజిల్ ​బంకులోనే ప్రమాదం  
  •     సుమారు రూ.50 లక్షల నష్టం 


కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్​సర్క్యూట్‌‌తో మంటలంటుకోవడంతో రాజధాని బస్సు పూర్తిగా కాలిపోగా, మరో ఎక్స్​ప్రెస్ ​పాక్షికంగా దగ్ధమైంది. డీజిల్​ బంకులో ప్రమాదం చోటుచేసుకోగా అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. ఆర్టీసీ సిబ్బంది కథనం ప్రకారం..కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన రాజధాని బస్సు ఆదివారం ఉదయం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్​పోర్టులో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు కోరుట్లకు వచ్చింది. బస్టాండ్​లో ప్రయాణికులను దింపి డిపోకు వెళ్లింది.

బంకులో డీజిల్ ​పోయించుకున్నాక మెయింటనెన్స్​ చూసే మెకానిక్ ​సిబ్బంది వచ్చి బస్సులో కూర్చుని సెల్ఫ్​చూశారు. అది రాకపోవడంతో రిపేర్ ​చేస్తున్నారు. ముగ్గురు చెక్​ చేసినా పని కాలేదు. అంతలోనే బస్సు బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్​స్టేషన్​కు, పోలీసులకు సమాచారమిచ్చారు. మెట్​పల్లిలో ఫైర్​స్టేషన్​ ఉండడంతో 15 నిమిషాల్లో రావాల్సిన ఫైరింజన్​ 45 నిమిషాలకు వచ్చింది. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు కు హ్యాండ్​బ్రేక్ ​వేసి ఉండడంతో ముందుకు కదల్లేదు. దీంతో రెండు జేసీబీల సాయంతో బంకు నుంచి గ్యారేజీలోకి తీసుకెళ్లడంతో భారీ ప్రమాదం తప్పింది. తహసీల్దార్ ​కిషన్​, సీఐ ప్రవీణ్​కుమార్, కోరుట్ల , మెట్​పల్లి డీఎంలు విజయ మాధురి, వేదవతి వచ్చి పరిశీలించారు. దాదాపు రూ.50 లక్షల వరకు నష్టం వాటిలినట్లు అధికారులు తెలిపారు.