నల్గొండ అభివృద్ధి చేసింది నేనే.. చేసేది నేనే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అభివృద్ధి చేసింది నేనే.. చేసేది నేనే:  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసింది నేనే.. చేసేది నేనే.. అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆదివారం (జనవరి 25) నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన .. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.  48 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ట్రాక్టర్ నడిపి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన మంత్రి.. రూ.2,200 కోట్లతో కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు.

 కాంగ్రెస్ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంఅవుతుందని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. పేదలకు ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. 10 ఏళ్ల BRS పాలనలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. BRS పార్టీని ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారని అన్నారు. 

 నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిందని.. ఇకనుంచి మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అన్ని డివిజన్లను సమస్యలేని కాలనీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 

ప్రతి డివిజన్‌లో ప్రతిరోజూ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పిన మంత్రి.. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు.  మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు.