SA20 Final: ఫైనల్లో CSK చిచ్చర పిడుగు మెరుపు సెంచరీ.. ఛేజింగ్‌లో కావ్యమారన్‌కు టెన్షన్ టెన్షన్

SA20 Final: ఫైనల్లో CSK చిచ్చర పిడుగు మెరుపు సెంచరీ.. ఛేజింగ్‌లో కావ్యమారన్‌కు టెన్షన్ టెన్షన్

సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం (జనవరి 25) ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కేప్ టౌన్ వేదికగా న్యూలాండ్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ ఫైటింగ్ టోటల్ బోర్డు మీద పెట్టింది. డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కడే వీర ఉతుకుడు ఉతికి సెంచరీ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. బ్రేవీస్ సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 

ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ ఇన్నింగ్స్ కు బ్రేవీస్ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. ఒక్కడే క్రీజ్ లో నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. జట్టు కోసం చివరి వరకు క్రీజ్ లో ఉండి ఒక మాదిరి స్కోర్ అందించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును బ్రేవీస్ ఆదుకున్నాడు. బ్రైస్ పార్సన్స్ తో కలిసి మూడో వికెట్ కు 97 పరుగులు జోడించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ఈ సఫారీ ఆటగాడు ఇప్పుడు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ కు ఛేజింగ్ టెన్షన్ ఉంచాడు. 

ఘోరమైన ఆరంభం:
      
ప్రిటోరియా క్యాపిటల్స్ కు ఈ మ్యాచ్ లో ఘోరమైన ఆరంభం లభించింది. ఆ జట్టు ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. కానర్ ఎస్టర్హుయిజెన్ డకౌట్ కాగా.. షాయ్ హోప్ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. ఏ ఈదశలో బ్రేవీస్, బ్రైస్ పార్సన్స్ తో కలిసి మూడో వికెట్ కు 97 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. పార్సన్స్ ఔట్ కావడంతో పరుగుల వేగం తగ్గింది. అయితే చివరి వరకు క్రీజ్ లో ఉన్న బ్రెవిస్ జట్టుకు యావరేజ్ టోటల్ అందించాడు. సన్ రైజర్స్ టైటిల్ గెలవాలంటే విజయానికి 159 పరుగులు చేయాలి. 

ప్రస్తుతం ఛేజింగ్ చేస్తున్న సన్ రైజర్స్ 159 పరుగుల లక్ష్య ఛేదనలో 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. క్రీజ్ లో మాథ్యూ బ్రీట్జ్కే (30) ఉన్నాడు. సన్ రైజర్స్ గెలవాలంటే చివరి 10 ఓవర్లలో 104 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉండడంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం కష్టంగానే కనిపిస్తుంది. మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ చిచ్చర పిడుగు బ్రేవీస్ సెంచరీతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.