న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి కివీస్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు. ఆదివారం (జనవరి 25) గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. బుమ్రా తన పేస్ బౌలింగ్ తో నిప్పులు చెరిగితే.. స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలం చూపించాడు. న్యూజిలాండ్ లో ఫిలిప్స్ 48 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియన్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు.. బిష్ణోయ్, హార్దిక్ పాండ్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. పాండ్య పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ తో కాన్వే ఔటయ్యాడు. రెండో ఓవర్లో హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. రచీన్ రవీంద్రను ఔట్ చేసి టీమిండియాకు రెండో వికెట్ అందించాడు. కాసేపటికే సీఫెర్ట్ కూడా ఔట్ కావడంతో న్యూజిలాండ్ 34 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కివీస్ ను ఆదుకునే బాధ్యత ఫిలిప్స్, చాప్ మాన్ తీసుకున్నారు. ఇద్దరూ కూడా భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు.
వీరిద్దరి జోడీ నాలుగో వికెట్ కు 52 పరుగులు జోడించిన తర్వాత బిష్ణోయ్ చాప్ మాన్ ఔట్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కివీస్ పూర్తిగా పరుగులు చేయడంలో తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చారు. సాంట్నర్ (27) ఒక్కడే ఒక ఎండ్ లో పోరాడి జట్టు స్కోర్ ను 150 పరుగుల మార్క్ కు చేర్చాడు. ఇండియన్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు.. బిష్ణోయ్, హార్దిక్ పాండ్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రానాకు ఒక వికెట్ దక్కింది.
