
- బాయ్స్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం
- షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
- 8 మంది యువకులను రెస్క్యూ చేసిన ఫైర్ సిబ్బంది
- బొగ్గులకుంటలో ఘటన
బషీర్‌బాగ్, వెలుగు : బాయ్స్ హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగగా.. 8 మంది యువకులను ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసింది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది.బొగ్గులకుంటలోని కామినేని హాస్పిటల్ ముందు శ్రీనివాస బాయ్స్ హాస్టల్ ఉంది. రెండంతస్తుల బిల్డింగ్‌లో ఈ హాస్టల్‌ను నడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా హాస్టల్ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. హాస్టల్ లోపల 8 మంది స్టూడెంట్లు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. హాస్టల్లో చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ చేశారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు.
హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సాయంత్రం 6 గంటల సమయంలో సమాచారం అందిందని హైదరాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇన్‌టైమ్‌లో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశామన్నారు. హాస్టల్లో 30 మంది వరకు స్టూడెంట్లు ఉంటారని.. దసరా సెలవులు కావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లారన్నారు. ఇరుకు గదుల్లో సామగ్రి పెట్టడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌కు సైతం మంటలు విస్తరించాయన్నారు. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో హాస్టల్ నడుపుతూ ఎలాంటి ఫైర్ సేఫ్టీ పాటించని బిల్డింగ్ ఓనర్‌కు నోటీసులు ఇస్తామన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ ఉందని.. అక్కడికి మంటలు వ్యాపించి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రమాదంలో సర్టిఫికెట్లు, బట్టలు, ల్యాప్ టాప్ కాలిపోయాయని హాస్టల్లో ఉండే స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.