మాదాపూర్ జూబ్లీ ఎన్‌ క్లేవ్లో ఆక్రమణలు నేల మట్టం.. రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

మాదాపూర్ జూబ్లీ ఎన్‌ క్లేవ్లో ఆక్రమణలు నేల మట్టం.. రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్లోని మాదాపూర్ జూబ్లీ ఎన్‌ క్లేవ్లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. జై హింద్‌ రెడ్డి అనే వ్యక్తి పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని హైడ్రాకు జూబ్లీ ఎన్‌ క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. లే ఔట్‌లో ఉన్న 4 పార్కుల్లో 2 పార్కులతో పాటు, 5 వేల గజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఆక్రమణలను తొలగించి మొత్తం 16 వేల గజాల స్థలాన్ని  హైడ్రా రక్షించింది. దీని విలువ సుమారు 400 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా అధికారులు తెలిపారు.

1995లో అనుమతి పొందిన లే ఔట్‌ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన హోటల్ షెడ్, హోర్డింగ్‌లను హైడ్రా జేసీబీలు నేలమట్టం చేశాయి. హోటల్ అద్దె, ప్రకటనల ద్వారా జైహింద్‌రెడ్డి నెలకు4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని జూబ్లీ ఎన్‌ క్లేవ్ ప్రతినిధులు తెలిపారు. పార్కులు, ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని  హైడ్రా బోర్డులు పెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కబ్జాదారులపై పోలీసు కేసులు నమోదు చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.

కోకాపేటలో అక్రమ నిర్మాణాలు, అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిన్నారికుంటలో అక్రమంగా  నిర్మించిన  మూడు  భవనాలు,  సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు,  ఫిర్జాదిగూడ  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత, ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో బతుకమ్మకుంట,  మాదాపూర్లో సున్నం చెరువు పునరుద్ధరణ.. పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్ పాత్ల వంటి ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇంతకు ముందెన్నడూ లేని విధంగా హైడ్రా బుల్డోజర్ చర్యలు తీసుకుంటూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.

హైడ్రా ఏడాది కాలంలో 581 చోట్ల ఆక్రమ‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌ను తొల‌‌‌‌గించి 499 ఎక‌‌‌‌రాల ప్రభుత్వ భూమిని కాపాడింది. దాదాపు రూ. 30 వేల కోట్ల ఆస్తుల‌‌‌‌ను పరిర‌‌‌‌క్షించింది. ఇందులో 360 చెరువుల ఆక్రమణలను తొలగించి 133 ఎకరాలు, లేఅవుట్, తదితర కాలనీల్లో 86 చోట్ల ఆక్రమణలను తొలగించి 123 ఎకరాలు, 20 నాలాల ఆక్రమణలను తొలగించి 8 ఎకరాలకు పైగా, 74 రహదారుల ఆక్రమణలను తొలగించి 218.30 ఎకరాలు, 38 పార్కుల ఆక్రమణలను తొలగించి 10.65 ఎకరాలను కాపాడింది. అలాగే 5.94 ఎకరాల్లో అనధికార నిర్మాణాలను కూల్చేసింది.