
- 33 ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్న ఆఫీసర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా స్టాండింగ్ కమిటీ మీటింగ్ గురువారం జరగనున్నది. ఇందులో 33 ప్రతిపాదనలను అధికారులు ప్రవేశపెట్టనున్నారు. హెచ్ సిటీ పనులు, స్మార్ట్ పార్కింగ్, జీహెచ్ఎంసీ ఆస్తుల అద్దె లీజుల గడువు పెంపు, ఖాళీగా ఉన్న షాపులకు వేలంతో పాటు ఇతర ప్రపోజల్స్ఉన్నాయి.
టోలిచౌకి ఫ్లైఓవర్ కింద నిర్మించిన18 కొత్త వెండింగ్ షాపులను మూడేండ్ల పాటు టెండర్ కమ్ ఓపెన్ బహిరంగ వేలం ద్వారా అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. 25 ఏండ్ల గడువు ముగిసిన ఖాళీ షాపులకు బహిరంగ వేలం నిర్వహించడానికి, గడువు ముగిసిన షాపుల లీజులను పొడిగించటానికి స్టాండింగ్ కమిటీ అనుమతి కోరనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఒప్పందం, సిగ్నల్స్ నిర్వహణ, కొత్త సిగ్నల్స్ ఏర్పాటు కోసం రూ. 72.31 కోట్లతో టెండర్లు ఆహ్వానించేందుకు కమిటీ అనుమతిని కోరుతూ అధికారులు ప్రతిపాదనలను సమర్పించనున్నారు.
ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల నిర్వహణను ఏడేళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విషయం, సీసీఎఎంస్ ప్యానెల్స్ నిర్వహణ, కొత్త ఫిక్చర్ల స్థాపన కోసం రూ. 897 కోట్లతో టెండర్లు ఆహ్వానించడానికి కమిటీ ఆమోదం కోసం ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అసిస్టెంట్ ఎంటమాలజిస్టులను నియమించే ప్రపోజల్ కూడా స్టాండింగ్ కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది.
మొత్తం 33 మంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టులను ఔట్ సోర్స్ ద్వారా నియమించుకునేందుకు రూ.91.48 లక్షల నిధుల మంజూరుకు ఆమోదమివ్వాలని, హైడ్రా నుంచి 223 సెక్యూరిటీ గార్డులను జీహెచ్ఎంసీ పార్కుల కోసం ఉపయోగించేందుకు టెండర్ల ప్రక్రియకు అనుమతించాలనే ప్రపోజల్స్ స్టాండింగ్ కమిటీ ముందుకు రానున్నాయి.