ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తిస్తది..కాంగ్రెస్ బాధేంటో అర్థం కావట్లేదు: కిషన్ రెడ్డి.

ఈ బిల్లు అన్ని పార్టీలకు  వర్తిస్తది..కాంగ్రెస్ బాధేంటో అర్థం కావట్లేదు: కిషన్ రెడ్డి.

రాజ్యంగ సవరణను దేశమంతా స్వాగతిస్తోందన్నారు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  చట్టంలో ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం వ్యవస్థకు లేదన్నారు.  కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తోన్న తీరు దురదృష్టకరమని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాదపడుతుందో అర్థం కావడం లేదన్నారు.   ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు.  ఇది కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకురాలేదన్నారు.  ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ.. లోక్‌సభలో ఇండియా కూటమి నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. 

30 రోజులు జైల్లో ఉంటే పదవి పోయినట్టే

రాష్ట్రంలోని మంత్రి అయినా, దేశ ప్రధాని అయినా తీవ్ర నేరారోపణలతో నెలరోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను తీసుకొచ్చింది. ఐదేండ్లకు పైగా శిక్ష పడే నేరారోపణలతో వరుసగా 30 రోజుల పాటు జైలులో ఉన్నట్లైతే 31వ రోజు పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి ఉంటుందని బిల్లుల్లో పేర్కొంది. రాజీనామాకు నిరాకరించినా 31వ రోజు ఆటోమేటిక్​గా పదవి కోల్పోయేలా ప్రతిపాదనలు చేసింది. ఈమేరకు కేంద్రం సిద్ధం చేసిన మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం లోక్​సభలో ప్రవేశపెట్టారు.

ALSO READ : కేసీఆర్, హరీశ్.. కాళేశ్వరంలో అవినీతిని ఒప్పుకున్నట్టే!

ఆర్టికల్ 75 (ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల నియామకం), ఆర్టికల్ 164 (సీఎంలు, రాష్ట్ర మంత్రుల నియామకం)లో మార్పుల కోసం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు.  కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్​కు కూడా ఈ నిబంధన వర్తించేలా.. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ (సవరణ) బిల్లు–2025, జమ్మూ అండ్ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు –2025ను అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లులపై లోక్​సభలో ప్రతిపక్ష నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను చించి అమిత్ షాపైకి విసిరారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొస్తున్నదని మండిపడ్డారు. అమిత్ షా మాట్లాడుతుండగానే.. ప్రతిపక్ష, అధికార పార్టీ ఎంపీలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. చివరికి 3 బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ చేసిన తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు.