
- ఉపరాష్ట్రపతి ఎన్నిక జాతి ఆత్మకోసం జరిగే సైద్ధాంతిక యుద్ధం: ఖర్గే
- సంసద్ భవన్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి సన్మానం
- హాజరైన సోనియా, రాహుల్, ఇండియా కూటమి ఎంపీలు
న్యూఢిల్లీ, వెలుగు: ఉప రాష్ట్రపతి ఎన్నిక కేవలం పదవి కోసం జరిగే పోటీ కాదని, దేశ ప్రజల ఆత్మ కోసం జరిగే సైద్ధాంతిక యుద్ధమని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాన్ని ఎంచుకుంటే, తాము రాజ్యాంగ విలువలను మార్గదర్శకంగా అనుసరిస్తున్నామని తెలిపారు. బుధవారం సంసద్ భవన్ (పాత పార్లమెంట్ భవనం) లోని సెంట్రల్ హాల్ లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగ పునాదులైన న్యాయం, సమానత్వం, సమగ్రత విలువలు మూర్తీభవించిన వ్యక్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఇలాంటి సమయంలో రాజ్యసభ పనితీరులో నిష్పక్షపాతం, గౌరవాన్ని పునరుద్ధరించడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్‌ను బలపరుస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలను అణగదొక్కేందుకే కొత్త బిల్లులు
‘‘గత పదకొండేండ్ల బీజేపీ పాలనలో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈడీ, ఐటీ, సీబీఐ వంటి స్వయంప్రతిపత్తి గల సంస్థలను వాడుకుంటున్నది. ఇందుకోసం పార్లమెంట్లో తమ సంఖ్యా బలాన్ని చూపి దుర్వినియోగం చేస్తున్నది. తాజాగా తెచ్చిన కొత్త బిల్లులు కూడా.. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను మరింత అణగదొక్కడానికి, అస్థిరపరచడానికి సాధనంగా మారబోతున్నాయి. కీలకమైన అనేక బిల్లులు సజావుగా, సరైన చర్చ లేకుండా ఆమోదించేస్తున్నారు. బీజేపీ తన భావజాలాన్ని అమలు చేయడానికి పార్లమెంట్‌ను వేదికగా మల్చుకుంటున్నది. బీజేపీ సిద్ధాంతపరమైన ఆలోచనలను పార్లమెంటులో అడ్డుకోవడానికి, నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అవసరం” అని ఖర్గే పేర్కొన్నారు.