పోలీసు వెహికల్ను ఢీకొట్టిన చేపల లారీ..పొలాల్లోకి దూసుకెళ్లిన పెట్రోలింగ్ వాహనం

పోలీసు వెహికల్ను ఢీకొట్టిన చేపల లారీ..పొలాల్లోకి దూసుకెళ్లిన  పెట్రోలింగ్ వాహనం
  •     ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  •     సిద్దిపేట జిల్లా జిల్లెల్లగడ్డ  చెక్ పోస్ట్ వద్ద ఘటన 


హుస్నాబాద్, వెలుగు: పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ను చేపల లారీ ఢీకొట్టిన  ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ చెక్ పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. ప్రమాద సమయంలో వెహికల్​లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని నెల్లూరు నుంచి చేపల లోడుతో ఢిల్లీకి వెళ్లే భారీ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి అక్కన్నపేట పోలీస్ స్టేషన్​కు చెందిన పోలీసు పెట్రోలింగ్ వెహికల్​ను ఢీకొట్టింది. లారీ స్పీడ్ కు వెహికల్ సుమారు 200 మీటర్లు దూసుకెళ్లి సమీపంలోని పొలాల్లో పడిపోయింది.

 ప్రమాదం ధాటికి లారీ ముందుభాగం ధ్వంసం కాగా, ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. యూపీకి చెందిన డ్రైవర్ అంకుష్ సింగ్, రాజస్థాన్ కు చెందిన మరో డ్రైవర్ యూసఫ్ గాయపడ్డారు.  బాధితులను వెంటనే స్థానికులు, పోలీసులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం, సీఐ శ్రీను, ఎస్ఐ లక్ష్మారెడ్డి సందర్శించి ప్రమాద కారణాలపై ఆరా తీశారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.