ఆధార్ కార్డు నమూనాలో గణేశునికి మండపం

ఆధార్ కార్డు నమూనాలో గణేశునికి మండపం

దేశంలో వినాయక చవితి సందర్భంగా చిత్ర విచిత్రమైన గణేశుని విగ్రహాలు, మండపాలు ఆవిష్కృమవుతున్నాయి. ఈ క్రమంలోనే జార్ఖండ్ లో నిర్మించిన ఓ వినాయకుడి మండపం విషయంలో క్రియేటివిటీ పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆధార్ కార్డు నమూనాను పోలి ఉండేటట్టుగా గణేశుడి మండపాన్ని నిర్మించారు. అందులోనే వినాయకున్ని పెట్టి ప్రత్యేక పూజలు చేయడం సర్వత్రా ఆసక్తికర అంశంగా మారింది. ఈ ఘటన జార్ఖండ్ లోని జంషెట్ పూర్ లో చోటు చేసుకుంది.

మామూలుగా గణపతి మండపం అనగానే... నాలుగు కర్రలు పై కప్పు.. అదీ కాదంటే కొంచెం మోడ్రన్ గా ఉండే విధంగా కొత్త డిజైన్లు, ఆ స్థాయిలో లైటింగ్.. లేదంటే అలంకరణ. ఇవన్నీ ప్రతి ఏడూ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సారి మాత్రం వినాయక చవితి సందర్భంగా ఓ వినూత్న ఆలోచనకు పట్టం కట్టారు జంషెట్ పూర్ లోని ఓ గణేశ్ ఆలయ నిర్వాహకులు. ప్రతి ఒక్కరి గుర్తింపుకు చిహ్నంగా చెప్పుకునే ఆధార్ కార్డు తరహాలో గణేశ్ మండపాన్ని నిర్మించారు. ఆధార్ కార్డులో ఎలా అయితే తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, జన్మస్థలం లాంటి వివరాలు ఉంటాయో.. అదే విధంగా ఈ ఆధార్ కార్డు మండపంలోనూ వినాయకుడి వివరాలను పొందుపర్చారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే.. ఆధార్ కార్డులో ఫొటో ఉండే స్థానంలో గణేశ్ విగ్రహాన్ని పెట్టడం అందర్నీ ఆకర్షిస్తోంది.

ఈ ఆధార్ కార్డు గణేశ్ మండపం బ్యానర్ పై వినాయకునికి సంబంధించిన వివరాలు ఇప్పుడు అందర్నీ చూపు మరల్చుకోకుండా చేస్తున్నాయి. ఇక ఈ వివరాల విషయానికొస్తే.. పేరు దగ్గర శ్రీ గణేశ్, తండ్రి పేరు వద్ద మహాదేవ్ అని ప్రింట్ చేయించిన నిర్వాహకులు.. చిరునామా (అడ్రస్) స్థానంలో కైలాష్ పర్వత్, పై అంతస్తు, మానససరోవర్ నది దగ్గర్లోని కైలాశ్ అని చెప్పుకొచ్చారు. ఇక పిన్ నెంబర్ ను 000001గా తెలిపారు. ఇక పుట్టిన తేదీ వివరాలకొస్తే.. మొదటి నెల, ఒకటో తారీఖు , 6వ దశాబ్దానికి చెందిన వ్యక్తిగా రాసుకొచ్చారు. చివరగా ఆధార్ కార్డు నెంబర్ స్థానంలో 9678 9959 4584 అనే నెంబర్ తో కూడిన ఆధార్ కార్డును పోలిన మండపాన్ని తయారు చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో నిర్మించిన ఈ గణేశ్ మండపాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ ఆధార్ కార్డు గణేశ్ మండపంకు సంబంధించిన ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. ఈ మండపం వైరల్ గా మారింది.