హాస్పిటల్స్​లో చేరేవారి పేర్లతో ఇన్సూరెన్స్​

హాస్పిటల్స్​లో చేరేవారి పేర్లతో ఇన్సూరెన్స్​

వరంగల్/నల్లబెల్లి, వెలుగు : భద్రమ్ ​సినిమాలో ఎవరూ లేని అనాథలకు ఇన్సూరెన్స్​ చేయించి, వారిని హత్య చేసి డబ్బులు కొల్లగొట్టే విధానాన్ని కొంచం అటూ ఇటూగా వరంగల్​లో ఒక ముఠా ఫాలో అయ్యింది. ముసలివాళ్లను, అనారోగ్యంతో హాస్పిటల్స్​లో చేరే వారిని గుర్తించి ఇన్సూరెన్స్​ చేయించి వారు చనిపోయాక ఇన్సూరెన్స్​డబ్బులను క్లెయిమ్​చేస్తున్నారు. ఇందులో నిందితులైన వరంగల్‍ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన పుప్పాల రాముతో పాటు మరో ఏడుగురిని ఇప్పటికే కమిషనరేట్ ​టాస్క్​ఫోర్స్​ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన రాము ఒక ప్రధాన ఇన్సూరెన్స్​కంపెనీలో ఎంక్వైరీ ఆఫీసర్‍గా పనిచేస్తున్నాడు. ఇన్సూరెన్స్​చేసిన వారు చనిపోతే డబ్బులు ఎలా క్లెయిమ్‍ చేయాలో స్పష్టంగా తెలియడంతో అందులోంచి వచ్చిన ఆలోచన, పగిడి(భద్రమ్​) సినిమా ప్రభావంతో దందా మొదలుపెట్టాడు. మరో ముగ్గురి సాయంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి 30 మందిని ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. వీరికి కొన్ని హాస్పిటల్స్​నిర్వాహకులు చేదోడువాదోడుగా ఉండడంతో అనారోగ్యంతో వచ్చే వృద్ధులను గుర్తించారు. కచ్చితంగా చనిపోతారని తెలుసుకుని హాస్పిటల్స్​సిబ్బంది, ఏజెంట్ల సాయంతో కావాల్సిన ఆధార్​, ఇతర పత్రాలు సంపాదించేవారు. వారి పేరుతో మూడు, నాలుగు ఇన్సూరెన్స్​కంపెనీల్లో పాలసీలు కట్టి డాక్యుమెంట్లను తమ దగ్గర ఉంచుకునేవారు. 

ఎప్పుడు ఎవరు చనిపోతారా అని ఎదురుచూపులు 

 ఇన్సూరెన్స్​ చేసిన వారిలో ఎవరైనా చనిపోయారా అన్నది రోజూ క్రాస్​చెక్​చేసుకునేవారు. ఎప్పుడు ఎవరు చనిపోతారా అని ఎదురుచూసేవారు. ఎవరైనా మరణిస్తే ప్లాన్​ ఇంప్లిమెంట్​ చేసేవారు.  ఇన్సూరెన్స్​చేసిన అన్ని కంపెనీల్లో ఎంక్వైరీ చేసే వారు వీళ్ల మనుషులే కాబట్టి వెరిఫికేషన్​లో ఇబ్బంది వచ్చేది కాదు. డెత్​ సర్టిఫికెట్​ ఇష్యూ చేసే ఆఫీసర్లను కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నట్టు సమాచారం. అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకుని బంధువుల పేరుతో రూ.లక్షలను డ్రా చేసుకునేవారు. అక్కడో..ఇక్కడో విషయం బయటపడితే గొడవ జరగకుండా కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులు, రిపోర్టర్లను మచ్చిక చేసుకుని డబ్బులు ఇచ్చేవారు. భవిష్యత్​లో ఏదైనా జరిగితే తాను ఎవరెవరికి ముట్టజెప్పింది తెలియడానికి ప్రధాన నిందితుడు రాము నోట్స్​ కూడా రాసుకున్నాడు. ఈ నేపథ్యంలో నర్సంపేట, గీసుగొండ మండలాల పరిధిలో ఇద్దరు చనిపోగా, వారి ఇన్సూరెన్స్​డబ్బులను కూడా తీసుకున్నారు. ఇందులో ఒక ప్రజాప్రతినిధికి ముట్టాల్సిన వాటాలో తేడా రావడంతో వ్యూహం బెడిసికొట్టింది. విషయం మృతుల ఇంట్లో తెలియడంతో వ్యవహారం బయటికొచ్చింది. కోట్ల రూపాయల దందా కావడం, అధికార పార్టీ నేతలు ఉండటంతో పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. కేసు పూర్తి వివరాలను పోలీసులు ఒకటి రెండు రోజుల్లో బయటపెట్టే అవకాశం ఉంది.