కొలాంగోందిగూడ గోడు పట్టని సర్కార్

కొలాంగోందిగూడ గోడు పట్టని సర్కార్

ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలం కొలంగోందిగూడలో ఫారెస్టు ఆఫీసర్లు ఇండ్లు కూల్చేసి.. ఊరిని లేకుండా చేయడంలో నిరాశ్రయులైన కొలాంగోంది కుటుంబాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వారికి సాగు చేసుకునేందుకు భూమి, ఉండేందుకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీరికి రేషన్‌బియ్యం ఇవ్వడం లేదు. కరెంటు సౌకర్యం కూడా లేక  చీకట్లో ఉంటున్నారు.

ఆసిఫాబాద్, వెలుగు:  హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తోంది. నేటికి కొలాంగోంది గిరిజనుల పరిస్థితి ఏం మారలేదు. కొలాంగోందికి చెందిన ఆదివాసుల్లో 13 కుటుంబాలు ఆసిఫాబాద్ మండలంలోని పట్టు పరిశ్రమలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుంటే మరో మూడు కుటుంబాలు వాంకిడి మండలంలోని ఎస్సీ హాస్టల్ లో పునరావాసంలో ఉంటున్నాయి. వీరికి సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. వీరిలో పది మందికి భూముల పట్టాలు ఇచ్చారు కానీ భూములు మాత్రం చూపించలేదు. ఆదివాసులకు రేషన్ బియ్యం కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. వర్షానికి గుడిసెలు పూర్తిగా తడిసి ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సౌకర్యం లేకపోవడంతో చీకట్లోనే ఉంటున్నారు. వ్యవసాయ భూములు లేక ఈ ఏడాది పంటలు సాగు చేయలేకపోయారు. కూలి పనులు దొరక్క పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కుటుంబాన్ని పోషించుకుందామన్నా ఎవరూ అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. గవర్నమెంట్ కూడా తమకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని వాపోతున్నారు.

8 నెలలైనా న్యాయం జరగలె

ఎమ్మెల్యే ఆఫీస్​లో వినతిపత్రం అందజేసిన గిరిజనులు

కాగ జ్ నగర్, వెలుగు: 50 ఏళ్ల సంది ఉంటున్న ఊరిని తీసేసిండ్రు. కట్టుబట్టలతో బయటకు తీసి బుల్డోజర్లతో ఇండ్లు కూల్చేసి మమ్మల్ని ఫారెస్ట్​ టింబర్​డిపోలో ఉంచిండ్రు. హైకోర్టు చెబితే అక్కడి నుంచి వాంకిడిలోని బీసీ హాస్టల్​కు తోలుకుపోయిండ్రు. ఇప్పటికి ఎనిమిది నెలలు గడుస్తున్నా మాకు ఎటువంటి న్యాయం జరగలె.. అంటూ కొలాంగోంది గిరిజనులు వాపోయారు. వాంకిడి బీసీ హాస్టల్​లో పునరావాసం పొందిన వారిలో కొందరు శనివారం కాగజ్​నగర్​కు ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆఫీస్​లో వినతిపత్రం అందజేశారు. వాంకిడి హాస్టల్ లో సౌలత్​లు లేవని, వెంటనే తమకు న్యాయం చేసి పాత గ్రామం కొలాంగోందిలోనే ఉంచేలా చూడాలని ఎమ్మెల్యేను కోరేందుకు వచ్చినట్లు వారు తెలిపారు.

2019 జూన్ 12

ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ మండలం కొలంగోందిగూడలో కొలం, గోండు తెగలకు చెందిన 16 ఆదివాసీ కుటుంబాలు పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. ఒకరోజు అటవీ అధికారులు, పోలీసులు వచ్చి అటవీ భూమి ఆక్రమించారంటూ బుల్డోజర్​తో ఇళ్లు, గుడిసెలు నేలమట్టం చేశారు. బలవంతంగా తీసుకెళ్లి టింబర్ ​డిపోలో పెట్టారు. అక్కడ తినడానికి తిండి, ఉండటానికి గూడు లేక బిక్కుబిక్కుమంటున్న వారి పరిస్థితిని చూసి పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

2019 జూన్​ 16

కొలాంగోందిగూడ గిరిజనులను అడవి నుంచి తరలించి అటవీ శాఖ టింబర్​ డిపోలో ఉంచడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. పునరావాస చర్యలు తీసుకున్నాకే వాళ్లను అడవి నుంచి తరలించి ఉండాల్సిందని పేర్కొంది. వారికి తాత్కాలికంగా వసతి సౌకర్యం కల్పించాలని సూచించింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 67 మందికి 91 ఎకరాల భూమిని ఆరు నెలల్లోగా ఇవ్వాలని, ఏడాదిలోగా పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, వారి జీవనోపాధికి పశువులను అందజేయాలని ఆదేశించింది.