సమ్మె చేశారని.. డ్యూటీలో చేర్చుకుంటలే

సమ్మె చేశారని.. డ్యూటీలో చేర్చుకుంటలే
  • రోడ్డునపడ్డ 7,500 మంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు
  • నెలన్నర రోజులుగా ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
  • మంత్రిని కలిసినా పట్టించుకోని వైనం
  • పంచాయతీ సెక్రటరీలకు ‘ఉపాధి’ బాధ్యతలిచ్చిన సర్కారు
  • ఆవేదన చెందుతున్న ఎఫ్ఏలు

హైదరాబాద్, వెలుగు: సమ్మె చేశారని కక్ష గట్టింది.. డ్యూటీ లేదంటూ గెంటేసింది.. 7,50‌‌‌‌0 మంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల(ఎఫ్ఏ)ను రాష్ర్ట ప్రభుత్వం నిర్దయగా రోడ్డునపడేసింది. కరోనా ఉందని బాధ్యతాయుతంగా వ్యవహరించి.. 8 రోజుల్లోనే సమ్మె విరమించినా అధికారులు తమపై కనికరం చూపడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో చేర్చుకోవాలని నెలన్నర రోజులుగా ఎంపీడీఓలు, డీఆర్డీఓలు, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. పైగా తాము చేసే పనులను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు.

14 ఏళ్లుగా అత్తెసరు జీతాలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన 2005లోనే అన్ని గ్రామాల్లో ప్రభుత్వం కాంట్రాక్ట్​ పద్ధతిలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అనేక మంది నెలకు రూ.1,200 జీతానికి ఈ ఉద్యోగాల్లో చేరారు. 2007లో వారి వేతనం రూ.2 వేలు, 2008లో రూ.3,200, 2009లో రూ.6 వేలకు పెరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో  వారి జీతాన్ని అన్ని అలవెన్స్​లు కలిపి రూ.8,90‌‌‌‌0కు పెంచారు. ఇలా అత్తెసరు జీతాలతోనే 14 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఐదు నెలల కిందట గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జారీ చేసిన 4779 సర్క్యులర్ శాపంగా మారింది. గ్రామాల్లో కల్పించిన పనిదినాలను బట్టి ఎఫ్ఏలను మూడు లిస్టులుగా విభజించారు. జాబ్ కార్డు ఉన్న కుటుంబాలకు సగటున 30కిపైగా పనిదినాలు కల్పించిన ఎఫ్ఏల కాంట్రాక్ట్ రెన్యువల్​ చేసి, రూ.10 వేలు జీతం ఇవ్వాలని, అంతకు తక్కువ పనిదినాలు కల్పించిన వారికి రూ.5 వేల జీతం మాత్రమే ఇవ్వాలని సర్క్యులర్​లో పేర్కొన్నారు. సగటున 10 లోపు పని దినాలు కల్పించిన వారిని ఉద్యోగం నుంచి తీసేయాలని డీఆర్డీఓలను ఆదేశించారు.

పట్టించుకుంటలే..

తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా మారిన 4779 సర్క్యులర్ రద్దు చేయాలని, వేతనాలు పెంచాలనే డిమాండ్​తో ఫీల్డ్ అసిస్టెంట్లు ఫిబ్రవరి చివరి వారంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​కు సమ్మె నోటీసు ఇచ్చారు. మార్చి 12న సమ్మెకు దిగారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అదే నెల 20న ఆందోళన విరమించారు. అయితే అప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు వారిని డ్యూటీలోకి చేర్చుకోలేదు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ నాయకులు.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావును, కమిషనర్ రఘునందన్ రావును కలిసినా స్పందన లేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 27న ఎఫ్ఏలు చేసే విధులను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించడంతో వారిలో ఆందోళన పెరిగింది. 14 ఏళ్లుగా ఈజీఎస్​నే నమ్ముకుని పని చేస్తున్నామని, తమలో చాలా మందికి ఉద్యోగ అర్హత వయస్సు కూడా దాటిపోయిందని వారు చెప్తున్నారు.

నేడు ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష

ఫీల్డ్ అసిస్టెంట్లలో 99 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్​లోని బీసీ భవన్​లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా తమ ఇళ్లలో సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని కృష్ణయ్య.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు.

అన్యాయంగా తొలగించారు..

14 ఏళ్లుగా పని చేస్తున్న 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా తొలగించింది. సమ్మె విరమించి డ్యూటీలో చేరుతామంటే 55 రోజులుగా వేధిస్తున్నారు. వేధింపుల వల్లే ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు గుండెపోటుతో మరణించారు.

– ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంఘం

కరోనా మరణాలను దాచేస్తున్నారా?