సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు 

సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు 

హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ సాగింది. A4 బీఎల్ సంతోష్, A5 తుషార్, A6 జగ్గుస్వామి, A7 శ్రీనివాస్ లను ఎఫ్ఐఆర్ జాబితాలో చేరుస్తూ దాఖలైన మెమోను ఏసీబీ కోర్టు రిజక్ట్ చేయడంతో సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు మెమో కొట్టి వేయడంతో హైకోర్టుకు వచ్చామని, మెమోను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఏసీబీ కోర్టు తీర్పుపైనే తాము హైకోర్టుకు వచ్చామని, ఇందులో ప్రతిపాదిత నిందితుల తరఫు వాదనలు వినాల్సిన అవసరం లేదని హైకోర్టుకు వివరించారు. సిట్ నమోదు చేసిన కేసులో తమ క్లైయింట్స్ భాగస్వాములు కాబట్టి.. తమ వాదనలు కూడా వినాలని ప్రతిపాదిత తరపు నిందితుల న్యాయవాదులు హైకోర్టు సీనియర్ కౌన్సిల్ రాంచంద్రరావు, ఎల్. రవిచందర్ లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.  సిట్ తరపు అడ్వకేట్ జనరల్ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను చదవి వినిపించారు. మెమో రిజక్ట్ తీర్పు కాపీ.. క్వాష్ పిటిషన్ కి రాసే తీర్పు కాపీలా ఉందని కోర్టుకు ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు.

కేసులో A7గా ఉన్న  శ్రీనివాస్  తరపు వాదనలను రాంచంద్రరావు వినిపించారు. సిట్ జారీ చేసిన 41A సీఆర్ పీసీ నోటీసుకు శ్రీనివాస్ ఇప్పటికే రెండు రోజులు సిట్ విచారణకు హాజరు అయ్యారని, అయినా సరే సిట్ పోలీసులు శ్రీనివాస్ ను వేధిస్తున్నారని, అతడిని అక్రమంగా నిందితుల జాబితాలో చేర్చారని హైకోర్టు దృష్టికి రాంచంద్రరావు తీసుకొచ్చారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తికాకుండానే ఏసీబీ కోర్టులో ఉద్దేశపూర్వకంగా సిట్ అధికారులు మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. 

ఈ కేసులో A1రామచంద్ర భారతి తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ ఎల్. రవిచందర్ వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం 8 కింద కేసు పెట్టడం చట్ట విరుద్ధమని, మొయినాబాద్ పోలీసుల పరిధిలోని రాని సెక్షన్లను పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపారు. అలాగే.. రూ.100 కోట్లు డీల్ జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు ఆ డబ్బును బహిర్గతం చేయాలి కదా..? అని సిట్ తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. ఒక ఫొటో, వాట్సాప్ చాటింగ్ లో పేర్లు ఉన్నంత మాత్రాన నిందితుల జాబితాలో పేర్లను ఎలా చేర్చుతారంటూ వాదనలు వినిపించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన రామచంద్ర భారతి కోర్టు తీర్పుతో బెయిల్ పై బయటకు వచ్చారని, అయినా ఆయనపై అక్రమ కేసులు బనాయించి.. అరెస్ట్ చేశారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫాం హౌస్ లో కేసులో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపైనే ఎన్నికల ఉల్లంఘణ కేసులతో పాటు 80కి పైగా కేసులు ఉన్నాయని, ఆ డేటా తమ వద్ద ఉందని కోర్టుకు తెలిపారు. ప్రముఖులతో ఫొటోలు ఉన్నంత మాత్రాన వాళ్లందరికి కేసులతో సంబంధం ఉండదని వాదించారు. తాను ఇటీవలే ఒక ఎమ్మెల్యే తరపున కేసు వాదించానని, ఆ కేసు గెలవడంతో సదరు ఎమ్మెల్యే తనతో ఫొటో దిగారని, ఆ ఫొటోతో తనపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తారా..? అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి (ఈనెల9వ తేదీకి) వాయిదా వేసింది.