- వరంగల్ నిట్ టెక్నోజియాన్‌లో ఆకట్టుకున్న ఎగ్జిబిట్లు
- సరికొత్త టెక్నాలజీతో రేసింగ్ కార్లు, రిమోట్ రోబోలు, రాకెట్ లాంచర్లు, బైక్స్ తయారి
వరంగల్/కాజీపేట, వెలుగు: వరంగల్‌లోని ఎన్‌ఐటీలో శుక్రవారం నిర్వహించిన టెక్నోజియాన్-25 ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాలు, విద్యాసంస్థల నుంచి వచ్చిన ఏడు వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్లు సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన వివిధ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఓ స్టూడెంట్ స్టీరింగ్ అవసరం లేకుండానే చేతివేళ్లతో ఇచ్చే సిగ్నల్స్ ఆధారం నడిచే వాహనాన్ని రూపొందిస్తే.. మరో స్టూడెంట్ యుద్ధ సమయాల్లో పైలట్ల అవసరం లేకుండా కంట్రోల్ రూం నుంచే రిమోట్‌తో ఆపరేట్ చేసే హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం ఎలా కురిపించవచ్చో చూపించారు.
అలాగే రాకెట్ డిజైన్లు, షార్క్ ట్యాంక్ 2.0, భూకంపాలను తట్టుకునే బిల్డింగ్ మోడల్స్, చీకటి గదిలో ఆడే నియాన్ క్రికెట్, బాంబ్ డిఫ్యూజ్ చేసే కోడ్ రెడ్ ఛాలెంజ్, రేసింగ్ కార్లు, రిమోట్ రోబోలు.. ఇలా 23 కార్యక్రమాల ద్వారా 31 విభాగాల్లో ఈవెంట్లు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి టెక్నోజియాన్‌కు హాజరైన స్టూడెంట్లు.. ట్రెండింగ్ డ్రెస్‌లతో అలరించారు.
చినాబ్‌నదిపై బ్రిడ్జి నిర్మాణంలో పాల్గొన్న: ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ మాధవీలత
చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో పాల్గొనడం గర్వంగా ఉందని బెంగళూర్ ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ జి.మాధవీలత అన్నారు. వరంగల్ ఎన్‌ఐటీలో శుక్రవారం జరిగిన టెక్నోజియాన్ కార్యక్రమానికి ఆమె చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా చినాబ్ బ్రిడ్జి, రూపకల్పన, నిర్మాణ, నిర్మాణం వంటి విషయాలను స్టూడెంట్లతో పంచుకున్నారు.
ఎత్తైన కొండలు, భిన్నమైన వాతావరణంలో వంతెన నిర్మాణం ఎలా చేపట్టారో వివరించారు. జమ్మూకశ్మీర్ రైల్వే కలను సాకారం చేయడంలో ఈ బ్రిడ్జి అత్యంత క్లిష్టమైన దశగా నిలిచిందన్నారు. విద్యార్థులు పట్టుదలతో పనిచేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. అనంతరం స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్‌కుమార్ మాట్లాడారు.
గాలిలో హెలికాప్టర్.. భూమి మీద పైలెట్
శత్రు దేశాలతో యుద్ధాలు జరిగినప్పుడు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానాలు, హెలికాప్టర్ల ద్వారా దాడులు చేస్తుంటారు. ఈ టైంలో కొన్ని సార్లు జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే వరంగల్‌కు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ రిమోట్ ఆధారంగా పనిచేసే హెలికాప్టర్‌ను రూపొందించారు. యుద్ధాలు జరిగే టైంలో ఈ హెలికాప్టర్‌ను ఫీల్డ్‌లోకి దించిన తర్వాత కంట్రోల్ రూం నుంచే ఆపరేట్ చేస్తూ బాంబు దాడులు చేయొచ్చని సదరు స్టూడెంట్ తెలిపారు.
