ఆసిఫాబాద్ జిల్లాలో 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు పూర్తి

ఆసిఫాబాద్ జిల్లాలో 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు పూర్తి
  •     కొఠారి గ్రామంలో షియర్‌‌వాల్‌‌ టెక్నాలజీతో నిర్మాణం

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్‌‌ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన ఓ ఇందిరమ్మ లబ్ధిదారు సరికొత్త టెక్నాలజీతో 12 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఇందుకు షియర్‌‌ వాల్‌‌ టెక్నాలజీని ఉపయోగించారు. గ్రామానికి చెందిన ఆత్రం రూపాబాయికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్‌‌మెంట్‌‌ నిర్మించిన అనంతరం ఇటుకలతో కాకుండా.. పూర్తిగా కాంక్రీట్‌‌తోనే గోడలు నిర్మించారు. 

సోమవారం వరకు షెటరింగ్‌‌ దశలో ఉన్న ఇంటిపై బుధవారం కాంక్రీట్‌‌ స్లాబ్‌‌ పోసి గురువారం డీ-షెటరింగ్‌‌ చేశారు. ఇక తలుపులు, కిటికీలు అమర్చితే ఇంటి నిర్మాణం పూర్తి అయినట్లే. ఇటుక గోడల స్థానంలో కాంక్రీట్‌‌తో గోడలు నిర్మించినందున ఈ ఇండ్లు 50-నుంచి60 ఏండ్ల వరకు మన్నికగా ఉంటాయని ఇంజినీరింగ్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే 20 శాతం ఖర్చు సైతం తగ్గుతుందని, 10నుంచి-15 రోజుల్లోనే ఇల్లు సిద్ధం అవుతుందని హౌసింగ్‌‌ పీడీ ప్రకాశ్‌‌రావు తెలిపారు.