రష్యా క్రిమియాను కలిపే కెర్చ్‌ వంతెనపై భారీ పేలుడు

రష్యా క్రిమియాను కలిపే కెర్చ్‌ వంతెనపై భారీ పేలుడు

మాస్కో :  రష్యా, -క్రిమియాను కలిపే కెర్చ్‌ రోడ్డు, రైలు వంతెనపై భారీ పేలుడు జరిగింది. వంతెనపై ట్రక్కు బాంబు పేలడంతో ఆ సమయంలోనే అటు వైపు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్ల రైలుకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగినట్లు రష్యా వార్త సంస్థలు వెల్లడించాయి. ప్రమాదం కారణంగా వంతెనపై భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల తీవ్రతకు వంతెనపై కొంత భాగం కూలి సముద్రంలో పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు రష్యా అధికారులు తెలిపారు. 

ప్రమాదానికి అసలు కారణాలను రష్యా అధికారులు వెల్లడించలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ 70వ పుట్టినరోజు చేసుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. ఒక ట్రక్కును పేల్చివేయడంతోనే అగ్నికీలలు వ్యాపించినట్లు రష్యా పరిశోధన కమిటీ పేర్కొంది. ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ పేర్కొంది. ఈ ఘటన ఎలా జరిగింది..? దీనికి కారకులెవరు..? వంటి కీలక అంశాలపై పరిశోధన కమిటీ ముమ్మరంగా విచారణ సాగిస్తోంది. 

ఈ వంతెనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 2018లో ప్రారంభించారు. అజోవ్‌ సముద్రాన్ని, నల్ల సముద్రాన్ని కెర్చ్‌ జలసంధి కలుపుతుంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఉక్రెయిన్‌ దేశం నల్ల సముద్రం ద్వారానే నిర్వహిస్తోంది. అజోవ్‌ తీరం నుంచి నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్‌ వాణిజ్యం సాగాలంటే కెర్చ్‌ జలసంధిని దాటాల్సిందే. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న రష్యా.. 2014లో క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత రష్యా -క్రిమియాను కలిపేలా 2018లో 3 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కెర్చ్‌ జలసంధిపై రోడ్డు, రైలు వంతెనను మాస్కో నిర్మించింది. అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా దీనిపై ట్రక్కు నడిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తోన్న క్రెమ్లిన్ ఈ మార్గం ద్వారానే ఆయుధాలు, బలగాలను చేరవేస్తోంది.

ఎవరి పని..? 
కెర్చ్‌ వంతెనపై పేలుడుకు ఉక్రెయినే కారణమని క్రిమియా అధికారి ఒకరు ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో రష్యా దేశం విచారిస్తోంది. తాజా పేలుడుతో ఉక్రెయిన్‌-, రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారే ప్రమాదముందని తెలుస్తోంది.