షాద్ నగర్ లో మాక్స్ క్రిప్టో పేరుతో భారీ మోసం

షాద్ నగర్ లో మాక్స్ క్రిప్టో పేరుతో భారీ మోసం

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ మోసం బయటపడింది. మాక్స్ క్రిప్టో పేరుతో అధిక డబ్బు ఆశ చూపి.. ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేశారు నిర్వాహకులు. తీరా మోసపోయాక తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.

అసలేం జరిగింది..? 
డబ్బు ఆశతో ఉన్న వాళ్లను నమ్మించడం, నమ్మే వరకు కొంత మొత్తం రిటర్న్ ఇవ్వడం, నమ్మేవాళ్ల సంఖ్య పెరిగాక జెండా ఎత్తేయడం..తరచూ ఇలాంటి వార్తలు ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి షాద్ నగర్ లో జరిగింది. 

బాధితుల కథనం ప్రకారం..ఖాజా మొయినోద్దీన్, రాజీవ్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు మాక్స్ క్రిప్టో పేరుతో దుకాణం తెరిచారు. స్థానికంగా ఉన్న యువతను మాయమాటలతో నమ్మించారు. 6 నెలల్లో 3 రేట్లు అధికంగా డబ్బు ఇస్తామంటూ ఒక్కొక్కరి నుండి దాదాపు రూ.50 వేల నుండి 20 లక్షల వరకూ వసూలు చేశారు. మొదట్లో కొన్నాళ్ల పాటు బాగానే డబ్బులు ఇచ్చారు. కానీ.. గత 3 నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదంటున్నారు బాధితులు.

తమ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఖాజా మొయినోద్దీన్, రాజీవ్ శర్మ తప్పించుకుని తిరుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు వందల సంఖ్యలో ఉంటారని చెబుతున్నారు. తామంతా సుమారుగా రూ.15 కోట్లకు పైగా మోసపోయామంటున్నారు. కొందరు బాధితులు షాద్ నగర్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.