
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో భారీ కుంభకోణం జరిగింది. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఏకంగా రూ.52 లక్షల వర్సిటీ నిధులను దారి మళ్లించాడు. వివరాల్లోకి వెళ్తే.. జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి ఏడాది క్రితం వర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అకౌంట్స్ సెక్షన్లో పనిచేస్తున్న జాకీర్.. ఆ సెక్షన్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని భారీ కుట్రకు తెరలేపాడు.
ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి రూ.52లక్షల రూపాయల నిధులను తన ఖాతాకు మళ్లించాడు. ఇటీవల జరిపిన ఆడిట్లో ఈ కుట్రను యూనివర్సిటీ అధికారులు గుర్తించి, రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం జాకీర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.