యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేయాలి : కర్రె ప్రవీణ్

 యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేయాలి :  కర్రె ప్రవీణ్
  • యాదగిరిగుట్ట బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్

యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్ అండదండలతో ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకున్నా అధికార పార్టీ బినామీ వ్యక్తుల పేర్లపై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్ నాయకులు యాదగిరిగుట్టలో గత కొన్నేండ్ల నుంచి పడావు పడి ఉన్న ప్లాట్లను గుర్తించి సబ్ రిజిస్ట్రార్ తో కుమ్మక్కై ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకున్నా తమ బినామీల పేర్లపై ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఆరోపించారు.  యాదగిరిగుట్టలోని మయూరి హోటల్ పక్కన సర్వే నంబర్ 24/1లో  250 గజాల ప్లాట్ ను 1984లో కొనుగోలు చేసిన కొప్పు స్వామినాథన్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడని తెలిపారు.

 గత కొన్నేండ్లుగా ఆ ప్లాట్లును ఎవరూ పట్టించుకోకపోవడంతో..  ఇదే అదునుగా భావించిన పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ భర్త..  వల్లందాస్ స్వామి అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి వల్లందాస్ (కొప్పు) స్వామి అలియాస్ స్వామినాథన్ పేరుతో కొత్త డాక్యుమెంట్ సృష్టించి వారి బినామీపై రిజిస్ట్రేషన్ చేయించాడని ఆరోపించారు. సదరు ప్లాట్ లో మూడంతస్తుల బిల్డింగ్ ను కూడా నిర్మించారని తెలిపారు. ‌‌‌‌ఎలాంటి సీసీ కాపీ, లింకు డాక్యుమెంట్ లేకున్నా నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారం అండగా చూసుకుని పాత లింకు డాక్యుమెంట్లను ధ్వంసం చేసి సబ్ రిజిస్ట్రార్ తో కుమ్మక్కై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, కార్యదర్శులు కర్ణ, సురేష్, సీనియర్ నాయకులు రాజిరెడ్డి, నాయకులు విజయ్, శ్రీకాంత్, నరేష్, అజయ్, ప్రశాంత్, నిఖిలద తదితరులు ఉన్నారు.