యాదగిరిగుట్ట, వెలుగు:'యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేయాలి' అని ఆదివారం వెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి సోమవారం స్పందన వచ్చింది.
ఎలాంటి లింకు డాక్యుమెంట్లు, సీసీ కాపీ లేకున్నా ఓ ప్లాట్ ను వేరే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయగా.. వెలుగు దినపత్రిక వార్త ప్రచురించింది. దీంతో పొరపాటు జరిగిందని గ్రహించిన సదరు సబ్ రిజిస్ట్రార్.. సంబంధిత సేల్ డీడ్ డాక్యుమెంట్ ను సోమవారం రద్దు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్టలో సర్వే నంబర్ 24/1లో ఉన్న 250 గజాల ప్లాట్ ను 1984లో కొనుగోలు చేసిన కొప్పు స్వామినాథన్ చాలా సంవత్సరాల క్రితమే చనిపోగా.. అప్పటి నుండి ఆ ప్లాట్ ను బాధిత కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు. దీంతో యాదగిరిగుట్టకు చెందిన ఓ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ తో కుమ్మక్కై.. ఎలాంటి లింకు డాక్యుమెంట్ లేకున్నా అతని బినామీ వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేపించాడు.
ఇదే విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు వెలుగులోకి తేగా.. వెలుగు దినపత్రికలో ఆదివారం వార్త పబ్లిష్ అయింది. దీంతో తప్పు జరిగిందని తెలుసుకున్న సదరు సబ్ రిజిస్ట్రార్.. రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ ను సోమవారం రద్దు చేశారు. దీంతో తమ ప్లాట్ తిరిగి తమకు దక్కడానికి సహకరించిన బీజేపీ నాయకులకు, వెలుగు దినపత్రికకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు
తమకు తెలియకుండా చనిపోయిన తమ నాన్న కొప్పు స్వామినాథన్ పేరుపై ఉన్న ప్లాట్ ను తప్పుడు పత్రాలు సృష్టించి బబ్బూరి పోశెట్టి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన వల్లందాసు స్వామిపై కేసు నమోదు చేయాలని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కొప్పు స్వామినాథన్ కుమారుడు కొప్పు ఘనశ్యామ్ సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ విషయం రిజిస్ట్రేషన్ చేసుకున్న బబ్బూరి పోశెట్టికి కూడా తెలుసని, అందుకే వారిద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
