నల్గొండ, వెలుగు: పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి కంప్లైంట్ తీసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు,తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున ప్రజావాణిలో ప్రత్యేకించి ఎప్పటికప్పుడే ఫిర్యాదుదారుకు సమాచారం ఇచ్చేలా డీఆర్డీవో, గృహ నిర్మాణ శాఖ పీడీలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి మున్సిపల్ మండలాల ప్రత్యేక అధికారులు సమీక్షించి నివేదిక సమర్పించాలన్నారు.
ఏంఈవోలు స్కూళ్లను తనిఖీ చేయాలి
ఏంఈవోలు ప్రతి నెల స్కూళ్లను తప్పనిసరిగా సందర్శించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా ఉపాధ్యాయులు, ఎంఈఓలు సెలవుపై వెళ్లరాదన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాలలు, టాయిలెట్స్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్, బాలికల ఆరోగ్యం, శానిటేషన్, సైన్స్, మ్యాథ్స్, సర్కిల్స్ నిర్వహణ, ఎక్స్పోజర్ విజిట్లు, స్పోర్ట్స్ మెటీరియల్, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పెల్ఫ్ డిఫెన్స్,మాక్ పార్లమెంట్ నిర్వహణ, సేఫ్టీ క్లబ్‌ల ఏర్పాటు, టీచర్ పేరెంట్స్ మీటింగ్ , తదితర విషయాలపై సమీక్షించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఎంఈఓలు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
