- ముసాయిదా లిస్ట్‌పై లీడర్ల ప్రశ్నలు
యాదాద్రి, వెలుగు: ముసాయిదా ఓటర్ లిస్ట్‌లోని తప్పులపై పొలిటికల్ లీడర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకే ఇంటి నెంబర్లో 92 ఓట్లు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. మ్యాపింగ్‌లో ఫ్యామిలీ ఓట్లను విడదీయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు లిస్ట్‌పై కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో మంగళవారం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు లిస్ట్‌లోని తప్పులను పొలిటికల్ లీడర్లు ఎత్తి చూపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఆరో వార్డుల్లో ఒకే ఇంటి నెంబర్పై 92 ఓట్లు నమోదు చేసిన విషయాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రస్తావించారు.
ఒక్క ఇంటి నెంబర్పై 92 ఓట్లు ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించారు. ఈ కారణంగానే గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ వార్డు ఎస్టీకి రిజర్వ్ అయిందని చెప్పుకొచ్చారు. దీనిపై మున్సిపాలిటీల నుంచి హాజరైన ఆఫీసర్లు మాట్లాడారు. ఆ వార్డులో ఏండ్ల తరబడి కొందరు తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారని, దీనివల్ల పక్కన ఉన్న ఇంటి నెంబర్లో వారిని బీఎల్వోలు నమోదు చేసి ఉంటారని చెప్పారు. తొలగించడం మా చేతుల్లో లేదని, తహసీల్దార్ల పరిధిలో ఉంటుందని చెప్పారు. చనిపోయిన వారిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించక పోవడం వల్ల రిజర్వేషన్లపై ప్రభావం చూపుతుందని పొలిటికల్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి ఓట్లు వివిధ ఇంటి నెంబర్లలో నమోదు అయి ఉన్నాయని చెప్పారు.
ఇలా ఒక్కొక్కరు పలు వార్డుల్లో ఓటర్లుగా ఉన్నారన్నారు. ఒక వార్డులోని ఓటర్లను వేరే వార్డులోకి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. అదే విధంగా భార్య, భర్త, ఫ్యామిలీ మెంబర్లను వేర్వేరు వార్డుల్లోకి ఓటర్లుగా ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. ఒకే ఇంటి నెంబర్‌తో ఉన్న ఓట్లను ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయాన్ని లీడర్లు ప్రస్తావించారు. ఆలేరు మున్సిపాలిటీలో కొలనుపాక రోడ్డులో నివాసం ఉంటున్న వారని కొలనుపాక గ్రామ పంచాయతీ ఓటరు లిస్ట్‌లో చేర్చారని తెలిపారు. 2020 మున్సిపాలిటీ ఎన్నికల సమయంలోని వార్డుల్లోని ఓటరు లిస్ట్‌ను యధాతథంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అభ్యంతరాలను పరిష్కరిస్తాం: కలెక్టర్ హనుమంతరావు
పొలిటికల్ లీడర్ల అభ్యంతరాలను పరిష్కరిస్తామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. అక్టోబర్ 1, 2025 ఓటరు జాబితాలో అప్డేట్ అయిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. పొరపాట్లను సవరించి ఈ నెల 10న ఫైనల్ లిస్ట్ ప్రచురిస్తామని తెలిపారు. మీటింగ్లో అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులు బట్టు రాంచంద్రయ్య, చందా మహేందర్ గుప్తా, రత్నపురం బలరాం, కే వెంకటేశ్, బట్టుపల్లి అనురాధ ఉన్నారు.
