కేంద్ర సాహిత్య అకాడమీని భారత ప్రభుత్వం 1954 మార్చి 12న అధికారికంగా స్థాపించింది. 1956 జనవరి 7న అది సొసైటీగా నమోదయ్యింది. భారతీయ భాషల అభివృద్ధి కోసం సాహిత్య కార్యకలాపాలను ప్రోత్సహించాలన్నది ఈ అకాడమీ ప్రధాన ఉద్దేశం. ఇలాంటివాటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ.. ఒకసారి ఏర్పాటైన తర్వాత వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండకుండా స్వయం ప్రతిపత్తితో విధులను నిర్వర్తించాలి. రాజ్యం నియంత్రణ ఉంటే సాహిత్యం వికసించదు. రచయితలు స్వీయ నియంత్రణకు లోనై సామాజిక, రాజకీయ వాస్తవాలు రాస్తే గుర్తింపు కోల్పోతామేమోనని లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఉద్భవించేది కళ కాదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం మాత్రమే జరుగుతుంది. అలాంటి వాతావారణం పాలకుల అభిప్రాయాలకు అనుకూలంగా మాట్లాడే ప్రతినిధులుగా రచయితలను మారుస్తుంది.
కేంద్ర సాహిత్య అకాడమీ ప్రారంభమైన మరుసటి రోజే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కార్యదర్శి కృష్ణ కృపలానీకి ఒక లేఖ రాశారు. అందులో సూర్యకాంత్ త్రిపాఠి పరిస్థితిపై ఆందోళన వ్యక్తపరిచారు. ఆయన రచనా ప్రతిభను ప్రశంసిస్తూ అతను తన అవసరం కోసం 25, 30 రూపాయలకే తన పుస్తకాలని అమ్ముతున్నారని, వాటిని ప్రచురించిన పబ్లిషర్స్ లబ్ధి పొందుతున్నారని ఆందోళన వ్యక్తపరిచి ఈ పరిస్థితి రాకుండా అకాడమీ కృషి చేయాలని కోరారు. ఆ తర్వాత హిందీ కవయిత్రి మహాదేవి వర్మ, అశ్వఘోషుడి బుద్ధ చరిత్ర, ఋగ్వేదం అనువాదాల ప్రచురణ కోసం ఆర్థిక సాయం కోరారు.
ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పటి విద్యాశాఖ మంత్రి ఆజాద్ ప్రకారం మత ప్రాధాన్యం ఉన్న రచనలకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ప్రోత్సాహం ఇవ్వకూడదు. ఎడ్విన్ అర్నాల్డ్ రాసిన ‘ది లైట్ ఆఫ్ ఏషియా’ అన్న రచనను మత గ్రంథంగా కాక సాహిత్య రచనగా చూస్తారని వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ అన్నారు. నెహ్రూ ఇంకా ముందుకు వెళ్లి బుద్ధ చరిత్ర, ఋగ్వేదం లాంటివి ప్రాచీన భారతీయ సాహిత్య మహా కావ్యాలు. వాటిని మత గ్రంథాలుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. ఈ వారసత్వం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది.
అకాడమీ అవార్డుల ప్రకటన రద్దు..?
డిసెంబర్ నెలలో అవార్డుల ప్రకటన ఉంటుంది. ప్రతి సంవత్సరం 24 భాషల్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డులని అకాడమీ ప్రకటిస్తుంది. అన్ని భాషల జ్యూరీలు సమగ్ర చర్చల తర్వాత విజేతలను ఖరారు చేస్తారు. ఆ జాబితాను అకాడమీ కార్య నిర్వాహక మండలి ఆమోదించింది. డిసెంబర్ 18వ రోజు ఆ అవార్డుల వివరాలను ప్రకటించేందుకు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. సంబంధిత వ్యక్తులు అందరూ సమావేశానికి హాజరయ్యారు. సమోసాలు, చాయ్‌లను ఆస్వాదిస్తూ ఉండగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి అవార్డుల పునర్వ్యవస్థీకరణ గురించి హడావిడిగా పంపిన సర్క్యులర్ వచ్చింది.
ఆ సర్క్యులర్‌లో ఆయా అకాడమీలు మంత్రిత్వ శాఖతో సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని గుర్తు చేస్తూ, మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి లేకుండా అవార్డుల ప్రకటన ప్రక్రియను చేపట్టకూడదు. ఇది సర్క్యులర్ సారాంశం. దాంతో ప్రకటన రద్దయింది. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రతి భాషకు ప్రత్యేక జ్యూరీ ఉంటుంది. దానికి ఓ కన్వీనర్ ఉంటాడు. ఈ జ్యూరీలను ఏర్పాటు చేసింది అకాడమీ కార్యదర్శి పల్లవి ప్రశాంత్ హోల్కర్. పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిందీ ఆమె. విజేతలను ప్రకటించాల్సింది ఆమెనే.
2015వ సంవత్సరంలో రచయిత తార్కిక వాది ఎం.ఎం. కల్బుర్గి హత్యకు గురైన తరువాత అనేకమంది సాహితీ వేత్తలు అకాడమీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మరికొందరు తమ అవార్డులను తిరిగి ఇచ్చేశారు. ఆ స్వేచ్ఛాయుత ఆలోచనల మీద దాడి జరిగినప్పుడు అకాడమీ మౌనంగా ఉండడం వల్ల నిరసనగా తమ అవార్డులని తిరిగి ఇచ్చివేశారు. అప్పుడు మౌనం పాటించారు. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకోవడం ద్వారా అకాడమీ స్వయం ప్రతిపత్తికి దెబ్బ తగులుతుంది.
అకాడమీలను స్థాపించడం వరకే ప్రభుత్వాల బాధ్యత. ఆ తర్వాత వాటిలో జోక్యం చేసుకోరాదు. కానీ.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇది అనవసర జోక్యమా? అవసరమైన జోక్యమా? వేచి చూడాలి. అవార్డులు రాని రచయిత ప్రభావమా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఏమైనా ఇది సాహిత్య సేవకు శుభ సూచకంగా అనిపించడం లేదు.
న్యాయమూర్తుల ఎంపిక కోసం కొలీజియమ్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ మీద కూడా ఎన్నో ఆరోపణలు, పారదర్శకత లేదన్న నిందలు. అందులో సత్యం ఉంది. అయినా కొలీజియమ్‌ను మంచి చేసి దాన్నే కొనసాగించాలని ఆ కొలీజియమ్ వ్యవస్థని వ్యతిరేకించే న్యాయకోవిదులు అంటున్నారు. ఈ అకాడమీ అవార్డుల ఎంపిక ప్రక్రియలో కూడా పారదర్శకత లేదు. ఇష్టాలు, అయిష్టాలు.. శిష్యులు.. పరమ శిష్యులు.. అయినా ఇది ప్రభుత్వం చేతిలోకి పోవద్దని అంటున్న రచయితల సంఖ్యే ఎక్కువ. పెనం నుంచి పొయ్యిలోకి పోవద్దన్నది మెజారిటీ వ్యక్తుల అభిప్రాయం.
ఈ సాంస్కృతిక సంస్థల ఆధిపత్యంలో జరుగుతున్న పోరాటంలో చివరికి నష్టపోయేది ప్రజలే. రచయితల్లో అవార్డులు లేకపోతే కొంపలేమీ మునిగిపోవు. మంచి సాహిత్యం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దాశరథి రంగాచార్యకి అవార్డు వచ్చిందా? సాదీత్ హసన్ మంటోకి అవార్డు వచ్చిందా? వారిని తలదన్నే రచయితలు అవార్డు గ్రహీతల్లో ఎంతమంది..?
వివాదాలు లేవా..?
సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అది అనేక వివాదాలను ఎదుర్కొంది. అనుమానాస్పద నియామకాలు, అవార్డు గ్రహీతల ఎంపికలో పారదర్శకత లేకపోవడం లాంటి విషయంలో ఈ సంస్థపై తరచూ విమర్శలు వచ్చాయి. ఎలాంటి రచనలకు అవార్డులు వస్తున్నాయో, వాటి కోసం ఎలాంటి పైరవీలు జరుగుతున్నాయో చూస్తే అవార్డులని ఆపివేయడం సమంజసమేనని అంటున్న సాహిత్య కోవిదులూ ఉన్నారు. ప్రతిభ ఆధారంగా రచనలోని వైవిధ్యం ఆధారంగా ఈ అవార్డులు ఇవ్వడం లేదని అబ్దుల్ రజా హుస్సేన్ లాంటి విమర్శకులు ఫేస్‌బుక్ నిండా వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. అకాడమీ పెద్దలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవాళ్లు చక్రం తిప్పి తాము కోరుకున్న వారికి అప్పనంగా అవార్డులు ఇప్పించుకుంటు న్నారని ఆయన అంటున్నారు.
ఆయనే కాదు ఇంకా చాలామంది అంటూనే ఉన్నారు. మిగతా భాషల సంగతి ఏమో కానీ.. తెలుగులో చాలామంది కవులు, రచయితలు అవార్డులే తమ జీవితాశయం అన్న మాదిరిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయాలను చూసి అసహ్యించుకుంటున్న వాళ్లూ ఉన్నారు. విప్లవ రచయితలమని చెప్పుకుంటున్న వాళ్లు ఎప్పుడైతే అవార్డుల వేటలో పడ్డారో అప్పటినుంచి ఈ పరిస్థితి తెలుగు భాషలో మొదలైంది. అకస్మాత్తుగా ఈ అవార్డులని నిలిపివేయడం అకాడమీ స్వయం ప్రతిపత్తికి భంగం కలుగుతుందన్నది ఎంత వాస్తవమో, తెలుగు కవులు, రచయితల పైరవీలకు ఫుల్‌స్టాప్ పడుతుందన్నది కూడా అంతే వాస్తవం. అది ఫుల్‌స్టాప్ అవుతుందా, కామా అవుతుందా అన్నది కాలం చెబుతుంది. రచయితల లాబీ నుంచి రాజకీయ నాయకుల లాబీకి ఈ పైరవీలు మారవచ్చు.
- డా. మంగారి రాజేందర్,
కవి, రచయిత
9440483001
