కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో మంత్రి కోమటిరెడ్డిదే తుది నిర్ణయం

కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో మంత్రి కోమటిరెడ్డిదే తుది నిర్ణయం

నల్గొండ, వెలుగు: నల్గొండ  మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదే తుది నిర్ణయమని నల్గొండ  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ కౌన్సిలర్లు, వార్డు బూత్ ఇన్‌‌చార్జిలు, ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ కేటాయింపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే తుది నిర్ణయమన్నారు.  ఆయన నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు.

నల్గొండ పట్టణంలో 48 వార్డులు ఉండగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించిన తర్వాత గెలుపొందే వారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు.  ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు అయినట్లు, సీట్లు కేటాయించినట్లు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెడుతూ అయోమయానికి గురి చేస్తున్నారని వీటిని పార్టీ శ్రేణులు ఎవరు నమ్మవద్దు సూచించారు.  మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, పలువురు మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.