హామిల్టన్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్.. రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు చెక్ పెట్టింది. బ్యాటింగ్‌లో డేవన్ కాన్వే (60)కు తోడు బౌలింగ్‌లో ఫెర్గుసన్ (3/16), బెన్ సియిర్స్ (3/14) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ 68 రన్స్ తేడాతో ప్రొటీస్‌పై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను హోమ్ టీమ్ 1–1తో సమం చేసింది. టాస్ ఓడిన కివీస్ 20 ఓవర్లలో 175/6 స్కోరు చేసింది. జోష్ క్లార్క్‌సన్ (26 నాటౌట్), నిక్ కెల్లీ (21), మిచెల్ శాంట్నర్ (20), కోల్ మెకాంచీ (18 నాటౌట్) మెరుగ్గా ఆడారు.
టామ్ లాథమ్ (11), టిమ్ రాబిన్సన్ (1), జేమ్స్ నీషమ్ (8) నిరాశపర్చారు. వియాన్ ముల్డర్ 2 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 15.3 ఓవర్లలో 107 రన్స్‌కే ఆలౌటైంది. జార్జ్ లిండే (33) టాప్ స్కోరర్. రూబిన్ హెర్మాన్ (19), వియాన్ ముల్డర్ (16), జాసన్ స్మిత్ (12), డియాన్ ఫారెస్ట్ (10) పోరాడి విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. శాంట్నర్ 2 వికెట్లు పడగొట్టాడు. కాన్వేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఆక్లాండ్‌లో శుక్రవారం జరుగుతుంది.
