సింగపూర్ సిటీ: సింగపూర్ లో స్థిరపడిన ఒక కెనడియన్ జంట విడాకుల అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భార్య అడిగిన భారీ భరణం చెల్లించడం ఇష్టం లేక ఏడాదికి ఆరు కోట్లు జీతం వచ్చే ఉద్యోగానికి ఒక వ్యక్తి రాజీనామా చేశారు. అయితే, సింగపూర్ ఫ్యామిలీ కోర్టు మాత్రం చట్టం ముందు ఈ ఎత్తుగడలు సాగవని తేల్చిచెప్పింది. భరణం చెల్లించాల్సిందేనని పేర్కొంది.
కెనడియన్ దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి 2013లో సింగపూర్‌కు మకాం మారారు. భర్త ఒక కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా నెలకు సుమారు రూ.50 లక్షల జీతం పొందుతుండేవారు. భార్య గృహిణిగా ఉంటూ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తుండేవారు. అయితే, భర్త 2023 ఆగస్టులో ఇంటి నుంచి బయటకు వచ్చేసి మరో మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించారు.
మొదట భార్యాపిల్లల ఖర్చుల కోసం నెలకు రూ.15.50 లక్షలు ఇస్తానని అంగీకరించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.7.70 లక్షలకు తగ్గించారు. దీంతో భార్య కోర్టును ఆశ్రయించింది. తన కుటుంబ జీవన ప్రమాణాలకు అనుగుణంగా భరణం ఇవ్వాలని కోర్టుకు ఆమె విజ్ఞప్తి చేసింది. భార్య కోర్టులో పిటిషన్ వేసిన కొద్దిరోజులకే 2023 అక్టోబర్‌లో భర్త భారీ జీతం వస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ కేసును విచారించిన సింగపూర్ కోర్టు జడ్జి భరణం చెల్లించకుండా తప్పించుకోవడానికే ఆ వ్యక్తి ఉద్యోగం వదిలేశారని నిర్ధారించారు.
