కూలీలపై కానిస్టేబుల్​ దాడి

కూలీలపై కానిస్టేబుల్​ దాడి

సిద్దిపేట రూరల్, వెలుగు :  సిద్దిపేట అర్బన్​ మండలం ఏన్​ సాన్​ పల్లిలో కూలి చేసుకుని జీవించే దంపతులు,  వృద్ధుడిపై  సోమవారం ఓ జైలు కానిస్టేబుల్ దాడి చేశాడు. గ్రామస్తులు, సర్పంచ్ రవీందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామ పరిధిలో సబ్ జైలు కోసం ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ స్థలం పరిధి చూసుకోవడానికి సబ్ జైలుకు చెందిన సిబ్బందిలో నుంచి ఒకరిని వాచ్​మన్​గా పెట్టారు.  జైలుకు కేటాయించిన స్థలం ఖాళీగా ఉండడంతో  కొన్ని రోజుల నుంచి మెగా సంస్థకు చెందిన వ్యక్తులు అక్కడ తమ సామాను ఉంచుకొని పనులు చేసుకున్నారు.  

ఈ మధ్యనే వారు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. వారు అక్కడ  వదిలి వెళ్లిన చిన్న చిన్న ఇనుప ముక్కలను ఏరుకొని అమ్ముకోవడానికి  గ్రామ పరిధిలోని తిప్పరబోయిన కాలనీకి చెందిన భార్యాభర్తలు తిప్పరబోయిన ఎల్లయ్య, మణెమ్మ,  తిప్పర బోయిన నరసయ్య అనే వృద్ధుడితో కలిసి ఆదివారం వెళ్లారు. అక్కడ వాచ్​ మన్​ గా డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్​ ఇక్కడికి రావద్దు అంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. తాను కానిస్టేబుల్ అని తనతోనే ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? అంటూ తన చేతిలో ఉన్నలాఠీతో మొదట భార్యాభర్తలపై ఆ తర్వాత వృద్ధుడిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ విషయమై బాధితులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఐ భాను ప్రకాష్ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు మేరకు దరఖాస్తు తీసుకున్నామని ఎంక్వైరీ చేసి యాక్షన్​ తీసుకుంటామని తెలిపారు.