పాకిస్తాన్‌ బందీగా భారత జవాన్‌.. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను బంధించిన పాక్‌

పాకిస్తాన్‌ బందీగా భారత జవాన్‌.. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను బంధించిన పాక్‌

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్‌-పాక్‌ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. భారత జవానును పాకిస్తాన్‌ బందీగా చేసుకుంది. భారత్, పాక్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను పాక్‌ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని పాక్ ఆరోపించింది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ను అక్రమంగా బంధించడంపై భారత్ మండిపడింది. బుధవారం ఫిరోజ్పూర్ బోర్డర్ దగ్గర 182వ బెటాలియన్కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్ ప్రమాదవశాత్తూ బోర్డర్ దాటాడు. పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ ను బంధించారు. ఆ సమయంలో పీకే సింగ్ బీఎస్ఎఫ్ యూనిఫాం ధరించి సర్వీస్ రైఫిల్తో ఉన్నారు.

Also Read:-భారత్ Vs పాకిస్తాన్ వాణిజ్య యుద్ధం: రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల లిస్ట్ ఇదే..

సరిహద్దు అవతల పొలం పనులు చేసుకుంటున్న రైతులకు తోడుగా ఉన్న పీకే సింగ్ ఒక చెట్టు కింద నీడలో కూర్చుని ఉండగా పాక్ రేంజర్లు ఆయనను బంధించారు. పీకే సింగ్ నిర్భంధంపై సరిహద్దులోని భద్రతా దళాల మధ్య సమావేశం కొనసాగుతోంది. బీఎస్ఎఫ్ జవానును తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. పహల్గాం ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో భారత జవాను నిర్భంధం చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 23న సాయంత్రం జవానును పాక్ నిర్భంధించింది.

పర్యాటకులే లక్ష్యంగా జమ్మూకాశ్మీర్​లో టెర్రరిస్టులు తెగబడిన సంగతి తెలిసిందే. ఆర్మీ యూనిఫాంలో వచ్చి, మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికినవాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ‘మినీ స్విట్జర్లాండ్​’.. కాల్పులతో దద్దరిల్లింది. ఎక్కడికక్కడ మృతదేహాలతో రక్తసిక్తమైంది. ఈ మారణహోమంలో 26 మంది ప్రాణాలు వదిలారు. మృతుల్లో పలువురు హనీమూన్​కు వచ్చిన దంపతులు ఉన్నారు. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి తామే పాల్పడ్డట్లు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ‘ది రెసిస్టెంట్​ ఫ్రంట్’ (టీఆర్​ఎఫ్​) ప్రకటించింది. ఈ ఘటనతో భారత్, పాక్ మధ్య దైపాక్షిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.