ఇక నుంచి డిజిటల్​ బీమా

ఇక నుంచి డిజిటల్​ బీమా
  • ఏప్రిల్ ​నుంచి కొత్త విధానం              
  • ప్రకటించిన ఐఆర్​డీఏ

న్యూఢిల్లీ : బీమా రంగానికి సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది.  ఏప్రిల్ 1, 2024 నుంచి కస్టమర్లు  డిజిటల్ రూపంలోనే పాలసీలను తీసుకోవాలి. అన్ని రకాల పాలసీలనూ ఇదే పద్ధతిలో జారీ చేస్తారని  ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ, డెవలప్​మెంట్​  అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) ప్రకటించింది. పాలసీదారుల ప్రయోజనాలను రక్షించడానికి, బీమా ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సంస్థ ప్రకటించింది. 

ఈ-ఇన్సూరెన్స్ ఖాతాలు అంటే ఏమిటి?

ఈ–ఇన్సూరెన్స్ పాలసీ ఖాతాలు డిజిటల్ ఫార్మాట్‌‌‌‌లో  ఉంటాయి. అనేక ప్రైవేట్ బీమా సంస్థలు ఇప్పటికే ఈ–ఇన్సూరెన్స్ ఖాతాలను అందజేస్తుండగా, పాలసీ హోల్డర్లు ఇప్పుడు తమ పాలసీలను డిజిగ్నేటెడ్ ఇన్సూరెన్స్ రిపోజిటరీల ద్వారా డిజిటల్‌‌‌‌గా కొనుగోలు చేయాలి. కొత్త నిబంధనల అమలుతో, బీమా కంపెనీలు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌‌‌‌లో పాలసీలను జారీ చేస్తాయి.  అన్ని పాలసీలను ఆన్​లైన్​లోనే చూడవచ్చు. ఏవైనా డాక్యుమెంట్లు పోగొట్టుకున్నా సులభంగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.  అన్ని రకాల పాలసీలు కొనొచ్చు. క్లెయిమ్​లు పంపవచ్చు. 

ఫిజికల్ ​పాలసీల సంగతేంటి ?

డిజిటల్ విధానం వచ్చినప్పటికీ, పాలసీ హోల్డర్‌‌‌‌లు తమ పాలసీలను భౌతిక రూపంలో ఉంచుకోవచ్చు. బీమా కొనుగోళ్ల కోసం ప్రపోజల్​ ఫారమ్‌‌‌‌లను పూరించేటప్పుడు ఫిజికల్​ కాపీలను ఎంచుకోవచ్చు. సాంప్రదాయ డాక్యుమెంటేషన్‌‌‌‌ను ఇష్టపడే వారి కోసం ఈ సదుపాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ–-ఇన్సూరెన్స్ ఖాతాను తెరవడం  సరళమైన ప్రక్రియ.  కొత్త పాలసీని కొనుగోలు చేసే సమయంలో డిజిటల్ ​పాలసీ తీసుకోవచ్చు.  ఇప్పటికే ఉన్న ఫిజికల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చవచ్చు.పాలసీ హోల్డర్లు తమ పాలసీలన్నింటినీ ఒకే ఖాతా ద్వారా డిజిటల్‌‌‌‌గా నిర్వహించవచ్చు. లావాదేవీలు చేయవచ్చు. డిజిటల్ ఇన్సూరెన్స్​కు మారడం వల్ల పాలసీదారులకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు. ఈ–-ఇన్సూరెన్స్ ఖాతాను ఉచితంగానే తెరవవచ్చు.