పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి

పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి
హసన్ పర్తి, వెలుగు : నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు  చేసి దేశంలోని పేద వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రను అడ్డుకోవాలని మాజీ ఐఏఎస్  ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ కామర్స్​ సెమినార్  హాల్​లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘నూతన జాతీయ విద్యా విధానం–2020,- విద్యార్థులపై దాని ప్రభావం, పర్యవసనాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ పదేండ్ల మోదీ పాలన అదాని, అంబానీ, నీరవ్  మోదీ, విజయ్ మాల్యా వంటి పెట్టుబడిదారులకు సేవ చేస్తూ తరించడానికే సరిపోయిందన్నారు. దేశ ప్రజల సంక్షేమం, విద్య, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించే విషయాన్ని పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతి సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కారు చౌకగా అమ్మడం, ఎలక్ట్రోల్  బాండ్ల రూపంలో వారు ఇచ్చే డబ్బుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం మాత్రమే చేశారని దుయ్యబట్టారు. 

అచ్ఛే దిన్, భారత్  వికాస్, సబ్ కా సాత్  కేవలం మాటల గారడీలకే పరిమితమైందన్నారు. దేశంలో 11 లక్షల స్కూల్స్​ ఉంటే పీఎంసీ స్కీమ్​ కింద ఏడాదికి 14 వేల బడులను మాత్రమే డెవలప్​ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని  ప్రశ్నించారు. విద్యావేత్తలు, మేధావుల అభిప్రాయాలు తీసుకోకుండా నూతన విద్యా విధానం ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. పాఠ్య పుస్తకాల్లో లౌకిక, ప్రజాస్వామ్య, సోషలిస్ట్  భావాలను తీసేసి, అశాస్త్రీయ, మూఢత్వ భావాలను ప్రవేశపెట్టి విద్యార్థుల మనసులు కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కులం, మతం లేని భారతదేశ నిర్మాణానికి ప్రశ్నించే తత్వాన్ని, ప్రజాస్వామిక లక్షణాలను, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. హెచ్​సీయూ ప్రొఫెసర్  లక్ష్మీనారాయణ, ఓయూ రిటైర్డ్  ప్రొఫెసర్  పద్మజాషా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వానికి విద్యారంగంపై చిత్తశుద్ధి లేదన్నారు. విద్యారంగానికి 2.5 శాతం నిధులు మాత్రమే కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు. కేయూ రిటైర్డ్  ప్రొఫెసర్  కూరపాటి వెంకటనారాయణ, పి. జగదీశ్వర్, తెలంగాణ డెమోక్రటిక్  ఫోరం రాష్ట్ర నాయకులు పృథ్వి, పీడీఎస్​యూ స్టేట్​ జనరల్​ సెక్రటరీ నామాల ఆజాద్, ఖలేదా ఫర్వీన్, స్కైబాబా పాల్గొన్నారు.